కుల రాజకీయాల గురించి తొలిసారిగా చంద్రబాబు ఆగ్రహం..

Deekshitha Reddy
టీడీపీపై కులముద్ర ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే.. చంద్రబాబు ఎప్పుడూ కుల రాజకీయాల గురించి గంభీరంగా మాట్లాడలేదు. కానీ ఆయన తొలిసారిగా గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కుల రాజకీయాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలతో ప్రజల మధ్య అడ్డుగోడలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓ వెధవపని చేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరని, కానీ సిగ్గులేని వాళ్లు తప్పు చేసి బహిరంగంగా తిరుగుతున్నారని అన్నారు చంద్రబాబు. అలా సిగ్గులేని వారు తప్పు చేసి తిరగడానికి కుల, మతాలను అడ్డుపెట్టుకుంటున్నారని అన్నారు. ఆంబోతులు బట్టలు విప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. తప్పు చేసిన వారిని మందలించి కఠిన చర్యలు తీసుకోవాల్సినవారే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు చంద్రబాబు. మందలించాల్సిన వారే నిర్లక్ష్యంగా ఉండటంతో తప్పు చేసినవారు మరీ బరితెగించి పోతున్నారని అన్నారు.
పార్టీ పెద్దల ఉదాసీనత వల్లే సంఘ విద్రోహ శక్తులు పెట్రేగిపోతున్నాయని, అత్యాచారాలు, దాడులు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని అన్నారు చంద్రబాబు. సీఎం ఒకరిద్దర్ని మందలించి దండిస్తే, మిగతావారికి భయం వస్తుందని చెప్పారు. రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో ఉందన, అది దుర్మార్గమైన విషయం అని అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి గిరిజనులకు గోరంత సాయం చేసి, కొండంత చేశానని చెప్పుకుంటున్నారని, కొండంత సాయం చేయకపోగా కొండల్ని సైతం దోచేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు చంద్రబాబు.
తాజా రాజకీయాలపై చంద్రబాబు స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు తాజా రాజకీయ వ్యవహారాలపై ఘాటుగా స్పందించారని టీడీపీ అనుకూల వ్యాఖ్యానాలు ఓవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు చేసిన తప్పులకు ఎప్పుడు సమాధానం చెబుతారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తప్పు చేశారని, దాన్ని ఇంకా కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: