అమరావతి : ఎంఎల్ఏల్లో పెరిగిపోతున్న టెన్షన్

Vijaya






ఎంఎల్ఏలంటే ఇక్కడ వైసీపీ ఎంఎల్ఏలని మాత్రమే. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ కొందరు ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందట. దీనికి కారణం ఏమిటంటే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమమే. వచ్చే ఎన్నికల్లో  ఎంఎల్ఏ అభ్యర్ధుల గెలుపోటములు వాలంటీర్ల చేతిలో ఉందని తేలిపోయింది. అందరి ఎంఎల్ఏల భవిష్యత్తు వాలంటీర్ల చేతుల్లో లేకపోయినా కొందరు ఎంఎల్ఏల గెలుపు మాత్రం వాలంటీర్ల చేతుల్లోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇందుకే కొందరిలో టెన్షన్ పెరిగిపోవటం.



ఇంతకీ విషయం ఏమిటంటే తన సొంత నియోజకవర్గం గంగాధరనెల్లూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గడపగడపకు వైసీపీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక పెద్దావిడతో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతు సంక్షేమపథకాలు అందుతున్నాయా అని అడిగారు. అందుకు ఆవిడ అందుతున్నట్లు చెప్పారు. సంక్షేమపథకాలు ఎవరిస్తున్నారని అడిగారు. అందుకు ఆవిడ బదులిస్తు వాలంటీర్లని చెప్పారు. ఎన్ని పథకాలగురించి అడిగినా తమకు అందుతున్నదంతా వాలంటీర్ల వల్లే  అని పెద్దావిడ చెప్పారు.




ఇలాంటి అనుభవాలే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంఎల్ఏలకు ఎదురయ్యిందట. దీనిబట్టి అర్ధమవుతున్నదేమంటే సంక్షేమపథకాలు అందుకుంటున్న జనాలందరికీ ఎంఎల్ఏలు, మంత్రుల కన్నా వాలంటీర్లే ఎక్కువగా టచ్ లో ఉన్నారని. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవాలంటే కచ్చితంగా వాలంటీర్లు చెబితే తప్ప లబ్దిదారులు వైసీపీకి ఓట్లేయరేమో అనే భయం పెరిగిపోతోంది. పథకాల విషయంలో కావచ్చు ఏదో పని విషయంలో రెగ్యులర్ గా తమకు అందుబాటులో ఉన్న వాలంటీర్లతోనే లబ్దిదారులకు బాగా యాక్సెస్ డెవలపైపోయింది.




ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఊహించే ఎంఎల్ఏలు, మంత్రులందరినీ జనాల్లో తిరగమని, లబ్దిదారులతో టచ్ లో ఉండమని పదే పదే చెప్పారు. అయితే జగన్ మాట విన్నవారు విన్నారు విననివాళ్ళు వినలేదు. చాలామంది ఎంఎల్ఏలు వాలంటీర్ల ద్వారా జనాలతో టచ్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఎదురుకావటంలేదు. కొందరు ఎంఎల్ఏలైతే అసలు జనాలతో టచ్ లోనే లేకపోవటంతో అలాంటి వారికంతా సమస్యలు తప్పేట్లు లేదు. మొత్తానికి కొందరు ఎంఎల్ఏలకు టెన్షన్ అయితే తప్పేట్లు లేదని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: