అమర్నాథ్ లో మరోసారి వరదలు, తెలుగు రాష్ట్రాల్లో కలవరం..

Deekshitha Reddy
ఇటీవల అమర్నాథ్ యాత్రలో వరదలతో 15మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. అప్పట్లో గల్లంతైన వారికోసం బంధువులు హైరానా పడ్డారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి మరణాల సంఖ్య లేదు కానీ, యాత్రకు వెళ్లిన వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించామంటున్నారు అధికారులు. హిమాలయాల్ోల ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ఆకస్మిక వర్షాలు, అనుకోని వరదలు, అంతలోనే ఎండ.. ఇవన్నీ అక్కడ మామూలే. అయితే యాత్రకోసం వెెళ్లినవారు బస చేసే ప్రాంతాలు సురక్షితంగా ఉండాలి, లేకపోతే అకస్మాత్తుగా వచ్చే వరదలకు బలైపోవాల్సిందే. అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మాత్రం వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అమర్నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అంటూ కలకలం రేగింది. శివుడి మంచు లింగానికి సమీపంలోనే మరోసారి వరదలు వచ్చాయి, ఆసక్మికంగా వచ్చిన ఈ వరదలతో చాలామంది భయపడ్డారు. అయితే వెంటనే రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి వచ్చాయి. యాత్రికులను రక్షించాయి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ టీమ్ సిబ్బంది. ఈసారి ప్రాణనష్టం ఎక్కడా జరగలేదు. సరిగ్గా రెండు వారాల క్రితం ఇక్కడే అనూహ్య వాతావరణ మార్పుల వల్ల భారీ వరదలతో 15మంది మరణించారు. మరోసారి అమర్నాథ్ యాత్రలో వరదలు అనే సరికి అందరిలో ఆందోళన మొదలైంది.
అయినవారికోసం ఫోన్ కాల్స్..
తెలుగు రాష్ట్రాలనుంచి కూడా కొంతమంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. వారి బంధువులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అందరూ సేఫ్ అంటూ అధికారులు ప్రకటించినా కూడా తమ వారితో మాట్లాడేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. కొంతమందికి ఫోన్ సిగ్నల్స్ కలవడంలేదు, ఇంకొంతమందికి ఫోన్లు పనిచేయడంలేదు. దీంతో వారంతా ఆదుర్దాగా ఉన్నారు.
అమర్నాథ్ లో వాతావరణం మారిపోతుందని తెలియగానే.. మంగళవారం నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అదికారులు. పంచతరణి నుంచి పవిత్ర గుహ వరకు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీంతో దాదాపు 4వేలమంది యాత్రికులు తిరిగి పంచ తరణి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం యాత్రకు అనుకూలించడంలేదు. దీంతో వాతావరణం కుదుట పడిన తర్వాత వీరందర్నీ అక్కడినుంచి శివలింగం వరకు అనుమతిస్తామంటున్నారు. ప్రస్తుతం యాత్రికులు పంచ తరణి వద్ద వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: