చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెడ్మాస్టర్..

Deekshitha Reddy
ధర్నాలు, బంద్ ల వేళ.. పాఠశాలల ఉద్యోగులకు ధర్నాకోసం వచ్చిన విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వాగం జరగడం సహజమే. ఇటీవల ఏబీవీపీ నాయకులు ఏపీలో 117 జీవో రద్దుకోసం బంద్ చేపట్టారు. ఆ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంద్ కోసం వచ్చిన ఏబీవీపీ నాయకుడి చెంప ఛెల్లుమనిపించారు పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మీదేవి. ఇందకీ ఆమె అతనిపై ఎందుకు చేయి చేసుకున్నారు. దానికి గల కారణాలేంటి..?
స్టూడెంట్ యూనియన్లు సమ్మె చేపట్టాయంటే ప్రైవేటు పాఠశాలలు సహజంగానే ముందురోజు సెలవు ప్రకటిస్తాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు పైనుంచి ఆదేశాలు రావాలి. స్కూల్ పెట్టి ఆ తర్వాత పిల్లలను ఇంటికి పంపించొచ్చు కానీ, ముందు రోజే భయపడి రేపు స్కూల్ లేదు అని చెప్పలేరు. అందులోనూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ సమ్మె చేస్తోంది. ఈ దశలో స్కూల్ మూసేస్తే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే రాజంపేట గర్ల్స్ జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మీదేవి యథావిధిగా స్కూల్ తెరిచారు. అంతలోనే ఏబీవీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్కూల్ మూసివేయాలని, పిల్లల్ని ఇళ్లకు పంపించేయాలని సూచించారు.
కానీ హెడ్మాస్టర్ ససేమిరా అన్నారు. అప్పటికే పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారైందని, పిల్లల్ని ఇంటికి పంపిస్తే ఆ భోజనం వృథా అవుతుందని, అదే సమయంలో పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారని, పిల్లల్ని స్కూల్ లో వదిలిపెట్టి చాలామంది పేరెంట్స్ కూలీ పనులకు వెళ్తుంటారని, అలాంటి ఇళ్లలో పిల్లలు భోజనానికి ఇబ్బంది పడతారని చెప్పారు. కానీ ఏబీవీపీ నాయకులు స్కూల్ కి సెలవ ఇవ్వాల్సిందేనన్నారు. దీంతో మాటా మాటా పెరిగింది. ఓ దశలో హెడ్మాస్టర్ ని పరుష పదజాలంతో ఏబీవీపీ నాయకులు దూషించారని అందుకే ఆమె చేయి చేసుకున్నారని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏబీవీపీ నాయకులపై చేయి చేసుకోవడం ఏంటని, కొందరు అంటుంటే.. పిల్లల మధ్యాహ్న భోజనం విషయంలో రాద్ధాంతం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: