కుప్పంలో చంద్రబాబుకి కష్టకాలం..

Deekshitha Reddy
కుప్పం ఎంపీపీ పదవి కోల్పోవడం, మున్సిపాల్టీలో కూడా పట్టు కోల్పోవడంతో ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకి గడ్డుకాలం ఎదురైందని అనుకున్నారంతా. అయితే ఆ తర్వాతే అసలు తతంగం మొదలైంది. కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. దీనికి ఆయన ఎంచుకున్న ప్రధాన అస్త్రం చేరికలు. ముందుగా చేరికలతో టీడీపీని మానసికంగా బలహీనపరచాలనుకుంటున్నారు పెద్దిరెడ్డి. దానికి అనుగుణంగానే చిన్నా పెద్దా నాయకులందరికీ వైసీపీ కండువాలు కప్పేస్తున్నారు. సహజంగా లోకల్ లీడర్లను పార్టీలో చేర్చుకునే సమయంలో స్థానిక పెద్ద నాయకులు ముందుంటారు. కానీ నేరుగా మంత్రి ఇక్కడ రంగంలోకి దిగారు. చంద్రబాబుని టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి, కుప్పంలో టీడీపీని దెబ్బకొడుతున్నారు.
తాజాగా కుప్పం నియోజకవర్గం నుంచి 234 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భరత్‌ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. కుప్పం మండలం నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించారు వైసీపీ నేతలు. మల్లనూరుకు చెందిన 156 మంది, గుడుపల్లె మండలం గుడుపల్లి, వోయన పుత్తూరు, కుప్పిగానిపల్లి, కొడతనపల్లికి చెందిన 78 మందిని తాజాగా వైసీపీలో చేర్చుకున్నారు.
టీడీపీ తరఫున మల్లనూరు ఎంపీటీసీగా పోటీ చేసిన నారాయణస్వామి, సీనియర్ నాయకులు పీవీ సెల్వం, కుప్పన్, సత్తి తదితరులను వైసీపీలో చేర్చుకున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నాయకులు వైసీపీలో చేరారని చెబుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి. చేరికలతో కుప్పం నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతోందని చెప్పారాయన. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ మరింత బలపడిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో అన్నిటినీ వైసీపీ కైవలం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించినట్టే.. 2024లో కుప్పంలో చంద్రబాబుని కూడా ఓడిస్తామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో యువ నాయకుడు భరత్‌ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: