కొలంబో : జనాలు ఎందుకింతగా తిరగబడుతున్నారు ?

Vijaya



పాలకులపై జనాలు తిరగబడితే ఎలాగుంటుందో యావత్ ప్రపంచం ఇపుడు చూస్తోంది. శ్రీలంకలో జనాల తిరుగుబాటు దెబ్బకు అద్యక్షుడితో పాటు ఆయన కుటుంబం కూడా దేశం విడిచిపారిపోయింది. ఈ తరంలో వాళ్ళు రెండు విషయాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. మొదటిదేమో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఇక రెండోదేమో శ్రీలంకలో జనాల తిరుగుబాటు. ఆ దేశాల మధ్య యుద్ధం జరిగిందని, ఆ దేశంలో పాలకులపై జనాలు తిరగబడ్డారని ఎక్కువమంది చరిత్రలోనే చదువుకునుంటారు. కానీ ఇప్పటితరం ఈ రెండు అంశాలను ప్రత్యక్షంగానే చూస్తున్నారు.




అద్యక్షుడు గొటబాయ రాజపక్స భవనంపై దాడులు జరిపిన జనాలు తాజాగా ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే, పార్లమెంటు స్పీకర్ నివాసాలపైన కూడా దాడులు మొదలుపెట్టారు. జనాగ్రహాన్ని కంట్రోల్ చేయటంకోసం కీలకమైన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రధానమంత్రి జారీచేశారు. దేశమంతా మిలిట్రీని యాక్టివ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీని విధించినా జనాగ్రహం అదుపులోకి రావటంలేదు. మిలిటరీ, పోలీసులు ఇప్పటికే కొన్ని వేలమందిని అరెస్టులు చేశారు.





క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే చివరకు ప్రధానమంత్రి, స్పీకర్ కూడా దేశంవిడిచి పారిపోతారేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోని విక్రమ్ ఈ మధ్యనే ప్రధానమంత్రయ్యారు. అలాగే దేశపాలనలో స్పీకర్ పాత్ర నామమాత్రమన్న విషయం తెలిసిందే. వీళ్ళపైన కూడా ఎందుకు జనాగ్రహం ? ఎందుకంటే వీళ్ళిద్దరు అధ్యక్షుడు రాజపక్స చెప్పినట్లు వినే నేతలే అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన రాజపక్స పరిపాలనకు స్పీకరే ప్రత్యక్ష సాక్షి. రాజపక్స ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను స్పీకర్ ఆమోదించారు.





రాజపక్స ఒకవేళ అద్యక్షుడిగా రాజీనామా చేస్తే ప్రధానమంత్రి లేదా స్పీకర్ అధ్యక్షుడవుతారట. వీళ్ళద్దరిలో ఎవరు అధ్యక్షుడైనా మళ్ళీ రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నట్లన్నది జనాల వాదన. అందుకనే వీళ్ళని కూడా తమ పదవులకు రాజీనామాలు చేయాలంటు జనాలు డిమాండ్ చేస్తున్నారు. జనాల డిమాండ్లను పట్టించుకోకపోవటంతో వీళ్ళద్దరి నివాసాలపైన కూడా దాడులు మొదలయ్యాయి. మిలిటరీ, పోలీసులు ఎంతకాలమని వీళ్ళ భవనాల దగ్గర కాపలా కాయగలరు ? సునామీలా వచ్చేస్తున్న జనాల్లో ఎంతమందిని కాల్చిచంపగలరు ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: