గోదావరికి తోడు కృష్ణమ్మ కూడా.. నిండు కుండలా శ్రీశైలం...

Deekshitha Reddy
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రతాపం చూపిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏపీలో లంక గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే కృష్ణానది మాత్రం ఇంకా పోటెత్తలేదు. ప్రస్తుతానికి కృష్ణా వరద శ్రీశైలం ప్రాజెక్ట్ కి చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోంది. దీంతో త్వరలోనే శ్రీశైలం గేట్లు కూడా ఎత్తేస్తారనే అంచనాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేస్తే పర్యాటకుల సందడి నెలకొనే అవకాశముంది.
జూరాలనుంచి కృష్ణమ్మ పరవళ్లు..
భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టాలతో కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కృష్ణా నది ప్రాజెక్టుల్లోకి వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. కృష్ణా బేసిన్‌ లోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరదనీటి ప్రవాహం పెరిగింది. జూరాల ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ కి లక్షా 6 వేల క్యూసెక్కుల నీరు  ఇన్ ఫ్లో రూపంలో వస్తోంది. లక్షా 7 వేల క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, ప్రస్తుత ప్రాజెక్ట్ లో 1,039.50  అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల వద్ద 3 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలనుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ కి క్రమంగా వరద నీరు పోటెత్తుతోంది.. శ్రీశైలంకు లక్షా 3వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం ఇక్కడ 827.8 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. అయితే శ్రీశైలం డ్యామ్ నిండటానికి మరికొన్నిరోజులు సమయం పట్టేలా ఉంది. డ్యామ్ నిండిన తర్వాతే గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తివేస్తే పర్యాటకుల సందడి పెరుగుతుంది. ప్రతిసారీ కృష్ణా వరదల సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరకు పర్యాటకులు వస్తుంటారు. గేట్లు ఎత్తివేసిన తర్వాత ఆక్కడి ప్రకృతి రమణీయతను చూసి పులకించిపోతుంటారు. అయితే ఇప్పుడు పర్యాటకులు రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: