ముందస్తుకి కేసీఆర్ రెడీ.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే..?

Deekshitha Reddy
2014లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటే.. ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకి వెళ్లారు. 2018లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి, టీఆర్ఎస్ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. లెక్క ప్రకారం 2023లో అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ మరోసారి ముందస్తు మాట వినపడుతోంది. విపక్షాలు సవాళ్లు విసిరాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సీఎం కేసీఆర్ నోట ముందస్తు మాట వినపడింది. దీని భావమేంటి..? మరోసారి తెలంగాణలో ముందస్తు ఖాయమేనా..?
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అంటూ ప్రతిపక్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్‌ విసిరారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తేదీ ఖరారు చేసుకుని రావాలని చెప్పారు. బీజేపీ తేదీ ఖరారు చేసుకుని ముందుకొస్తే తాను కూడా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టంచేశారు. ముందస్తు బంతిని ప్రతిపక్షాల కోర్టులో పడేశారు కేసీఆర్. మీరు రెడీయా చెప్పండి, నేను రెడీ అనేశారు.
వాస్తవానికి తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పనిలో పనిగా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీజేపీకి ఆయన చాకిరేవు పెట్టారు. దేశాన్ని జలగలా పట్టిపీడిస్తున్న బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని దించి తీరుతామని చెప్పారు కేసీఆర్. దేశ చరిత్రలోనే మోదీ అసమర్థ ప్రధానిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో గతంలో ఎప్పుడూ లేనంతగా అవివేక పాలన నడుస్తోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భయంకరమైన అవినీతి, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. దేశంలో ఏ ఒక్క రంగంలోనూ ప్రగతి జాడే కనిపించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో అత్యవసర పరిస్థితి ఉందని, ఎమర్జెన్సీ నడుస్తోందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు ఉపేక్షిస్తే దేశం మరో వందేళ్లు వెనక్కిపోతుందని, ఇది గ్యారెంటీ అని అన్నారు కేసీఆర్.
దేశం అద్భుత ప్రగతి సాధించాలంటే మాత్రం.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కాదని, తెలంగాణ లాంటి సూపర్‌ఫాస్ట్‌ గవర్నమెంట్ కేంద్రంలో కూడా రావాలన్నారు కేసీఆర్. బీజేపీకి కాలం చెల్లిందని.. బీజేపీయేతర పార్టీ వస్తేనే దేశం ముందుకెళ్తుందని చెప్పారు. దీనికోసం తాము కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన ముందస్తు వ్యాఖ్యలు చేశారు. ముందస్తుకి వెళ్లే దమ్ముందా అంటూ వైరి వర్గాలను ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: