ఆ నియోజకవర్గం విషయంలో జగన్ ఇబ్బంది పడాల్సిందేనా..?

Deekshitha Reddy
2019 ఎన్నికల ముందు కూడా వైసీపీలో టికెట్ల కోసం కాంపిటీషన్ నడిచింది. అప్పుడు వైసీపీ ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా పెరిగిపోయింది. దీంతోపాటు టీడీపీనుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారి నియోజకవర్గాల విషయంలో జగన్ కు ఒత్తిడి పెరిగిపోతోంది. ముఖ్యంగా గన్నవరం విషయంలో పంచాయితీ తెగడంలేదు. వల్లభనేని వంశీకే టికెట్ కన్ఫామ్ అని సజ్జల చెప్పినా యార్లగడ్డ వెంకట్రావు మాత్రం పట్టు వదలడంలేదు. అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. వంశీ, యార్లగడ్డ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, రచ్చకెక్కడం, పార్టీ పరువు తీయడం, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.
గన్నవరం వైసీపీ రాజకీయాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కూడా.. గన్నవరంలో మాత్రం రేపోమాపో ఎన్నికలు అన్నంత హడావిడి ఉంది. అధికార పార్టీలో మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వల్లభనేని వంశీ 990 ఓట్ల మెజార్టీతో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై గెలిచారు. ఆ తర్వాత వంశీ వైసీపీలోకి వచ్చారు. యార్లగడ్డ కూడా వైసీపీలోనే ఉన్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. గత ఎన్నికల్లో వంశీ మెజార్టీ వెయ్యికి లోపే ఉండటంతో.. ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు యార్లగడ్డ. అయితే ఆయనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో వంసీకి టికెట్ ఇస్తే తాను స‌హ‌క‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు యార్లగడ్డ. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ తరపున వంశీ బ‌రిలోకి దిగితే త‌న మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని తేల్చి చెబుతున్నారాయన.
2014 ఎన్నిక‌ల్లో కూడా ఇక్కడ వంశీనే గెలిచారు. అప్పట్లో వంశీ ప్రత్యర్థి దుట్టా రామచంద్రరావు. ఆయన కూడా వంశీ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వంశీ వర్గానికి దుట్టా వర్గానికి కూడా పడటంలేదు. దుట్టా, యార్లగడ్డ వర్గాలు.. వంశీకి సపోర్ట్ చేయడంలేదు. వీరిద్దరితో వంశీకి అస్సలు పడటంలేదు. దీంతో ఆయన సమస్యలుంటే జగన్ కి వెళ్లి చెప్పుకోండి, ఇలా బహిరంగంగా విమర్శలు చేస్తారేంటని పలుమార్లు వారికి చెప్పి చూశారు. కానీ వారు వినడంలేదు. దీంతో ఇటీవల వంశీ కూడా విమర్శల డోసు పెంచారు. యార్లగడ్డ, దుట్టా వర్గాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మొత్తమ్మీద గన్నవరం నియోజకవర్గ వ్యవహారం వచ్చే ఎన్నికలనాటికి జగన్ కి తలనొప్పిగా మారే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: