పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు ఫిక్స్ అయ్యారా..? నాగబాబు పర్యటన అందుకేనా..?

Deekshitha Reddy
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా ఇంకా పవన్ కల్యాణ్ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకోలేదు. గతంలో గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఆ నియోజకవర్గాల్లో ఆయన పెద్దగా తిరిగింది లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఆయన నియోజకవర్గాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఈ దశలో తమ్ముడి తరపున అన్న నాగబాబు రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. పవన్ కల్యాణ్ కి ఉత్తారంధ్రలో ఓ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. గాజువాకలో పోటీ చేయాలా, లేక ఇంకో నియోజకవర్గాన్ని వెదుక్కోవాలా అనే డైలమాలో ఉన్నారు పవన్. ఆయన కోసం నాగబాబు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పవన్ పక్కాగా గెలిచే నియోజకవర్గాన్ని వెదికే పనిలో ఉన్నారు మెగా బ్రదర్.
జూన్ 1 నుంచి జనాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నాగబాబు పర్యటనకు సంబంధించి జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లాలో నాగబాబు పర్యటిస్తారు. మరుసటి రోజు జూన్ 2న విజయనగరం జిల్లాలో ఆయన నాయకులతో సమావేశం అవుతారు. జూన్ 3న విశాఖ జిల్లాలో కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈ మూడు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారు. ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులను ఆయన కలుస్తారు. జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీ నాయకులను కలసి భవిష్యత్ దిశా నిర్దేసం చేస్తారు. జిల్లా నాయకులకు ఆయన మూడు రోజులపాటు అందుబాటులో ఉంటారు.
ఏ నియోజకవర్గం బెటర్..
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహానాడుతో టీడీపీ, బస్సు యాత్రతో వైసీపీ.. ఒకరకంగా పొలిటికల్ హీట్ ని పెంచాయి. మరి జనసేన ఏం చేస్తుంది..? ఏం చేయాలి అనే విషయంపై కూడ నాగబాబు కార్యకర్తలు, నేతల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పలు కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు నాగబాబు. పార్టీ ఎదుగుదలకు దోహదపడే అంశాలను నాగబాబు అడిగి తెలుసుకుంటారని, ఆయనతో ఎవరైనా సమావేశం కావాలంటే ముందుగ సమాచారం ఇవ్వాలని పార్టీ ప్రకటించింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు నాగబాబు సమక్షంలో జనసేనలో చేరడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో జసేనలో ఊపొస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: