అమరావతి : జగన్ పరువంతా పోయిందా ?

Vijaya



అవును రవాణాశాఖ రాసిన లేఖతో జగన్మోహన్ రెడ్డి పరువుపోయినట్లే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే పెండింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులు వెంటనే చెల్లించకపోతే కాన్వాయ్ ను సమకూర్చేది లేదని రవాణాశాఖ ప్రభుత్వానికి తెగేసి చెప్పింది. ఈమధ్యనే రవాణాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ప్రభుత్వం నుండి రావాల్సిన కాన్వాయ్ బిల్లుల ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వానికి ఒక లేఖ రాయమని, తాను కూడా ఫాలోఅప్ చేస్తానని మంత్రి చెప్పారట.



అయితే రవాణాశాఖ ఉన్నతాధికారులు చేసిన పనితో జగన్ పరువుపోయింది. పెండింగ్ బిల్లుల కోసం లేఖ రాయటంలో తప్పేమీలేదు. అయితే అంతటితో ఊరుకోకుండా ముఖ్యమంత్రి, ఇతర వీఐపీల పర్యటనల్లో వాహనాలు పెట్టేదిలేదని లేఖలో దాదాపు ఒక వార్నింగ్ ఇవ్వటంతోనే సమస్య వచ్చింది. కాన్వాయ్ బిల్లులు గడచిన మూడేళ్ళుగా రు. 17.5 కోట్లు బకాయిలుండిపోయాయట.



తమకు రావాల్సిన బిల్లుల కోసం రవాణాశాఖ అధికారులు ఎంతడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదట. ముఖ్యమంత్రి కాన్వాయ్ బిల్లులు పెండింగులో ఉండటం చాలా సహజమే. ఇలాంటిది సంవత్సరాలుగా జరుగుతునే ఉంటాయి. ఏదో సందర్భంలో ప్రభుత్వం వాటిని రిలీజ్ చేస్తుంటుంది. ఆర్టీసీకి కూడా ప్రభుత్వం పెద్దఎత్తున బిల్లులు బకాయిలుండటం సాధారణ అంశమనే చెప్పాలి. ఆ శాఖల మంత్రులు సీఎంతో మాట్లాడుకుని ఏదో పద్దతిలో బిల్లులను రాబట్టుకుంటారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమకు రావాల్సిన బిల్లుల గురించి లేఖ రాయటం తప్పుకాదు. కానీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు లేఖ రాయటమే ఆశ్చర్యంగా ఉంది. ఈమధ్యనే ఒంగోలులో ఒక కుటుంబాన్ని రోడ్డుపైన దింపేసి వాళ్ళ కారును కాన్వాయ్ కోసమని తీసేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి పనులు, ఇలాంటి లేఖలే ప్రభుత్వం పరువు తీసేస్తాయి. మూడేళ్ళుగా కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే మరి ఆ శాఖ మంత్రి ఇంతకాలం ఏమి చేస్తున్నట్లు ? ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతోనో లేకపోతే సంబంధిత ఉన్నతాధికారులతోనో మాట్లాడుకుని బిల్లులను పాస్ చేయించుకునుంటే ఇపుడు రవాణాశాఖ లేఖ రూపంలో పరువుపోయేది కాదు కదా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: