అంబటి నోట.. పవన్ మాట.. వైసీపీ కాపు రాజకీయం మొదలు పెట్టిందా..

Deekshitha Reddy
మంత్రి అంబటి రాంబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఓ రేంజ్ లో ఇటీవల మాటల యుద్ధం జరిగింది. పవన్ కల్యాణ్, జగన్ ని విమర్శించిన ప్రతి సారీ అంబటి ఆయనకు కౌంటర్ ఇచ్చేవారు. మంత్రి వర్గంలోకి రాకముందు కూడా అంబటి, పవన్ పై సెటైర్లు వేశారు, ఇప్పుడు కూడా డోసు తగ్గించలేదు. అయితే తాజాగా.. అంబటి.. కాపు ఓట్ల గురించి, కాపు సామాజిక వర్గంలో పవన్ కల్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా కాపులంతా పవన్ కల్యాణ్ అంటున్నారని, కానీ ఆయనేమో చంద్రబాబు అంటున్నారని చెప్పారు అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో గడపగడపకు కార్యక్రమంలో రాంబాబు పాల్గొన్నారు. అధికారంలోకి కొచ్చిన తర్వాత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు 1.39 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిందని చెప్పారు అంబటి రాంబాబు. రాబోయే రెండేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయలు అందించబోతోందని అన్నారు. గడప గడపకు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు రాంబాబు. అయితే కాపులు, పవన్ కల్యాణ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ హాట్ గా మారాయి.
కాపులంతా పవన్ ని కోరుకుంటున్నారా..?
గతంలో పవన్ కల్యాణ్ కి, ఆయన సొంత సామాజిక వర్గంలోనే పరపతి లేదని వైసీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు.. విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. కాపులు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వం కోరుకుంటున్నారని వివరించారు. ఇప్పటి వరకూ పవన్ కి సొంత సామాజిక వర్గంలోనే బలం లేదు, బలగం లేదు అని చెప్పిన వైసీపీ నేతలు, సడన్ గా పవన్ ని మోసేయడానికి కారణం ఏంటి..? పవన్ కల్యాణ్ పొరపాటుగా చంద్రబాబు ట్రాప్ లో పడుతున్నారని చెప్పడానికా..? లేక కాపులంతా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్న పవన్  కి మద్దతుగా నిలవొద్దు అని చెప్పడానికా..? ఏది ఏమైనా... మా కాపులంతా పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటున్నారంటూ అంబటి రాంబాబు చెప్పిన మాటలు ఇప్పుడు అదే సామాజిక వర్గంలో ఆసక్తికరంగా మారాయి. పవన్ వెంట కాపులంతా నిలబడతారా..? లేక వారంతా వైసీపీకే మద్దతిస్తారా? అంబటి మాటల్లో నిజమెంత..? ఇప్పుడు తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: