హైదరాబాద్ : పాల్ అంటే కూడా కేసీయార్ భయపడుతున్నారా ?

Vijaya



వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా తెలంగాణాలో ఇపుడిదే విషయమై చర్చ జరుగుతోంది. కేఏ పాల్ అనే వ్యక్తిని మామూలుగా అయితే ఎవ్వరూ పట్టించుకోరు. ఆయనతో పనున్న వారు, ఆయన ద్వారా లబ్దిపొందాలని అనుకున్నవారు, ఆయన సంస్ధల్లో పనిచేస్తున్నవారు తప్ప ఇంకెవరు పాల్ గురించి ఆలోచించరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అనేతప్ప కేఏ పాల్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు కూడా లేదు.



కాకపోతే అప్పుడప్పుడు తాను చాలా పెద్ద వ్యక్తినని, ప్రపంచంలోని కొద్దిమంది పవర్ ఫుల్ వ్యక్తుల్లో తానొకడినని పాల్ చెప్పుకుంటుంటారు. టీవీ ఛానళ్ళకు ఏ మ్యాటర్ దొరక్కపోతే వెంటనే పాల్ కు ఫోన్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పాల్ ను తెలంగాణా ప్రభుత్వం హౌజ్ అరెస్టు చేయటమే విచిత్రంగా ఉంది. మూడు రోజుల క్రితం సిరిసిల్లలోని రైతుల దగ్గరకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంకు వెళ్లబోతుంటే అడ్డుకున్నారు.



రెండు సందర్భాల్లోను పాల్ ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందట. పాల్ పర్యటన వల్ల కూడా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని కేసీయార్ ప్రభుత్వం అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పాల్ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ప్రభుత్వం అనుకుంటోందంటేనే పాల్ అంటే భయపడుతోందా ? అనే అనుమానం పెరిగిపోతోంది.



పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటనను అడ్డుకుంటోందంటే అర్ధముంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదంటు అర్ధం చేసుకోవచ్చు. కానీ పాల్ పర్యటనను కూడా చివరకు ప్రభుత్వం అడ్డుకుంటోందంటే తాడును చూసి కూడా కేసీయార్ పాముగా భయపడుతున్నారని అర్ధమైపోతోంది. పాల్ ను ఫ్రీగా వదిలేసుంటే ఏమి జరుగుతుందనేది వేరే విషయం. అలాకాకుండా అనవసరంగా పాల్ ను అడ్డుకున్న కారణంగానే కేసీయార్ ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం పెరిగిపోతోంది. తనంతట తానుగానే ప్రభుత్వం చెత్త నెత్తినేసుకుంటోందా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: