అమరావతి : చంద్రబాబు పరిస్ధితి ఇంత అన్యాయమైపోయిందా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పరిస్ధితి మరీ ఇంత అన్యయమైపోతుందని ఎవరు అనుకునుండరు. రాజకీయ జీవితం క్లైమ్యాక్సుకు వస్తున్న నేపధ్యంలో చంద్రబాబు పరిస్ధితి ఎటూ కాకుండా పోతోంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ మాజీ సీఎంను ఎవరు కూడా నమ్మే పరిస్ధితులు కనబడటంలేదు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జాతీయస్ధాయిలో ఉద్యమించాలని, ఏకమవ్వాలని అనుకుంటున్న ప్రతిపక్షాలు చంద్రబాబును పక్కన పెట్టేశాయి. ఇదివరకు కూడా రెండుసార్లు జాతీయస్ధాయిలో పార్టీలు ఇలాగే చేశాయి. 



నిజానికి జాతీయస్ధాయిలోని ప్రతిపక్షాలు రెండు తెలుగురాష్ట్రాలను తమతో చేర్చుకోవటంలేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ నరేంద్రమోడీకి వ్యతిరేకంగా తమతో చేతులు కలపరనే అంచనాకు వచ్చాయి కాబట్టి లెక్కలోకి తీసుకోవటంలేదు. ఇక కేసీయార్ ను చూస్తే ఏపార్టీ కూడా నమ్మటంలేదు. కేసీయార్ ఎప్పుడెవరితో ఉంటారో, ఎవరిపైన ఆరోపణలతో విరుచుకుపడతారో ఎవరికీ అర్ధంకాదు. పైగా కేసీయార్ ట్రాక్ రికార్డు చూసిన తర్వాత సీఎంను ఎంతమాత్రం నమ్మేందుకు లేదని అర్ధం చేసుకున్నట్లున్నాయి. 



అందుకనే ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రతిపక్షాలు వదిలేశాయి. మరి జాతీయస్ధాయిలోని చాలామంది సీనియర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునే చంద్రబాబును ఏ పార్టీకూడా ఎందుకని దగ్గరకు తీసుకోవటంలేదు ? ఎందుకంటే నరేంద్రమోడీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అన్నీ పార్టీలు గమనిస్తునే ఉన్నాయి. మోడీకి వ్యతిరేకంగా నోరిప్పాలంటేనే చంద్రబాబు భయపడుతున్నారు. ఈ పరిస్దితుల్లో తమతో చేతులు కలుపుతారని ప్రతిపక్షాల నేతలు అనుకోవటంలేదు.



ఇక్కడ సమస్య ఏమిటంటే రాజకీయంగా క్లైమ్యాక్సుకు వచ్చేస్తున్న సమయంలో చంద్రబాబును ఎవరు నమ్మకపోవటం ఆశ్చర్యమే. మోడీతో అవసరముంటే సోనియాను తిట్టడం, సోనియాతో పొత్తు పెట్టుకోవటం కోసం మోడీని తిట్టడం లాంటి చేష్టలతోనే చంద్రబాబు చివరకు ఎవరికీ కాకుండా పోయినట్లున్నారు. రాజకీయంగా స్ధిరమైన స్టాండ్ తీసుకోలేకపోవటం, ప్రతి అడుగులోను తనకేంటి లాభమని చూసుకోవటం ఎక్కువైపోవటంతోనే చంద్రబాబును ఎవరు నమ్మని పరిస్దితులు వచ్చేశాయి. లేకపోతే ఒకపుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఇపుడీ పరిస్ధితులు రావటమంటే స్వయంకృతమనే చెప్పక తప్పదు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: