ఢిల్లీ : ఈ పరీక్ష పాసైతే పీకే గొప్పోడే

Vijaya



ఏదైనా పెద్ద పరీక్ష ఎదురైతే కానీ వ్యక్తుల సమర్ధత బయటపడదు. ఇపుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కు కూడా అలాంటి పరీక్షే ఎదురు కాబోతోంది. పీకే పరీక్ష ఎదురు కావటం ఏమిటంటే తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు కాబట్టే. ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే ఉన్న పీకే తొందరలోనే వ్యూహకర్త కమ్ పూర్తిస్ధాయి కాంగ్రెస్ నేతగా మారబోతున్నారు.




ఎప్పుడైతే కాంగ్రెస్ లో చేరుతారో అప్పటినుండే పరీక్షలు ఎదురుకాబోతున్నాయి. ఎలాగంటే ముందుగా గుజరాత్ ఎన్నికలతోనే పరీక్ష మొదలుకాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించటమే పీకే ఎదుర్కోబోయే అతిపెద్ద పరీక్ష. గుజరాత్ లో కాంగ్రెస్ అధికారానికి దూరమై దాదాపు రెండు దశాబ్దాలవుతోంది. ఇక్కడ బీజేపీదే తిరుగులేని అధికారం. అలాగని కాంగ్రెస్ మరీ అధమస్ధాయిలో మాత్రం లేదు.



182 సీట్ల అసెంబ్లీలో అధికార బీజేపీకి 112 సీట్లుంటే ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ కు 64 సీట్లున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, నేతల మధ్య ఆధిపత్య గొడవలు, అభ్యర్ధుల ఎంపికలో లోపాలు, ప్రచారంలో పొరబాట్లు ఇలా చాలావాటి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది. ఇదే సమయంలో నరేంద్రమోడి కనుసన్నల్లో నడుస్తున్న పార్టీ నేతలు, ఇష్టమున్నా లేకపోయినా ఏకతాటిపై నడుస్తున్న కమలనాదులు, కేంద్రంలో అధికారంలో ఉండటలం అన్నీ కలిసి అప్రతిహతంగా అధికారంలో కంటిన్యు అవుతోంది.



డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలంటే ఎంతో కాలంలేదు. కాబట్టి పీకే వెంటనే రంగంలోకి దిగి తనదైన స్టైల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టి పార్టీకి జవసత్వాలు కల్పించి, గట్టి నేతలను రంగంలోకి దింపటం, ప్రముఖులను పార్టీలోకి తీసుకురావటం, అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం అంతా తానై చూసుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావటమే పెద్ద చాలెంజ్. ఈ పరీక్షలో పీకే పాసైతే తర్వాత ఫేస్ చేయాల్సిన పరీక్షలు  చాలావున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షల సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు గుజరాత్ ఎన్నికలనే పెద్ద పరీక్షలో కాంగ్రెస్ ను గట్టెక్కించగలిగితేనే పీకే గొప్పోడంటారు. లేకపోతే అంతేసంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: