తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు ఓ శుభవార్త చెబుతోంది. 80 వేల పోస్టులకు పైగా భర్తీ చేస్తామన్న కేసీఆర్ సర్కారు తొలి నోటిఫికేషన్‌ కు రంగం సిద్ధం చేస్తోంది. 503 పోస్టులతో నేడో, రేపో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయబోతోందట. ఖాళీల ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన టీఎస్‌పీఎస్సీ.. 503 కొలువుల భర్తీకి ఏర్పాట్లు చేసుకుంటోంది. నిన్న ఇదే అంశంపై టీఎస్‌పీఎస్సీ కీలక సమావేశం నిర్వహించింది. 19 ప్రభుత్వ శాఖల్లోని 503 పోస్టులభర్తీపై ప్రతిపాదనలన్నింటినీ బోర్డు పరిశీలించి ఆమోదించింది.  

పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించింది. అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ణయానికి వచ్చింది. అయితే..  గతంలో గ్రూపు-1 కేటగిరీలో లేని విభాగాల పోస్టులను ఈసారి దాని పరిధిలోకి చేర్చాడం వల్ల వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర కేడర్‌ పోస్టులు మల్టీజోనల్‌ స్థాయికి మారిన విషయంపైనా స్పష్టత అవసరం. ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రాత పరీక్ష మార్కులతోనే ఎంపిక చేయాలి. దీనికి ప్రభుత్వం ఓకే చెప్పాల్సి ఉంది. ఈ క్లారిటీ వచ్చాక వెంటనే నోటిఫికేషన్ వస్తుందట.

కీలకమైన ఈ మూడు అంశాలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ రెడీగా ఉంది. ఇక ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి ఆది, సోమవారాల్లో  ఉత్తర్వులొస్తాయట. అవి రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. నోటిఫికేషన్‌ లో చెప్పాల్సిన దరఖాస్తుల స్వీకరణ గడువు, ప్రిలిమినరీ నిర్వహణ వంటి అంశాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక టైం టేబుల్‌ను ఇప్పటికే రెడీ చేసుకుంది.

తెలంగాణ వచ్చాక అత్యధిక పోస్టులతో వెలువడుతున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇదే అవుతుంది. ఉమ్మడి ఏపీలో వెలువడిన వాటితో పోల్చినా ఇదే నోటిఫికేషన్‌ అత్యధిక పోస్టులతో వెలువడనుంది. 503 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇంటర్వ్యూలు లేనందున తొమ్మిది నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: