కేటీఆర్ ది ఆత్మ విశ్వాసమా..? అతి విశ్వాసమా..?

Deekshitha Reddy
తెలంగాణలో టీఆర్ఎస్ ని ఎదిరించేంత సీన్ ఎవరికీ లేదనేది ఆ పార్టీ నేతల వాదన. టీఆర్ఎస్ ని మట్టి కరిపిస్తామంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ సవాళ్లు విసురుతుంటాయి. కానీ కేటీఆర్ మాత్రం ఆ రెండు పార్టీలతో తమకు పోటీయే లేదంటున్నారు. తమకు పోటీ కేవలం ఎంఐఎంతోటే అంటున్నారు. అసలు కాంగ్రెస్, బీజేపీని కేటీఆర్ ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కి నిజంగానే అంత బలం ఉందా అనేది తేలాల్సి ఉంది.
బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో ఉన్నవి తక్కువ సీట్లే కావొచ్చు. కానీ ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల టీఆర్ఎస్ మాత్రం ఇరుకున పడుతోందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే కేటీఆర్ మాత్రం ఆ రెండు పార్టీలను పూచిక పుల్లల్లాగా తీసిపారేస్తున్నారు. బీజేపీది కేవలం వాపు అని, బలుపు కాదని అంటున్నారాయన. బీజేపీ 2018 ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని వచ్చే ఎన్నికల్లో వంద స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతవుతుంది చెప్పారు కేటీఆర్.
మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణలో పుంజుకోవాలని చూస్తోంది. అయితే ఆ పార్టీకి కూడా గతంలో వచ్చిన వాటికంటే తక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు కేటీఆర్. 2014, 2018 ఎన్నికలకు టీఆర్ఎస్ బలం పెరిగిందని, తమకు ప్రజల మద్దతు పెరుగుతోందని చెప్పారు కేటీఆర్.
వాస్తవం ఏంటి..?
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ఇటీవల ఆరోపణలు పెరుగుతున్నాయి, అదే సమంయలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా పెచ్చు మీరాయని అంటున్నారు. ఈ దశలో పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచన. అందుకే ఆయన జాతీయ నాయకులతో సమావేశమవుతున్నారు. బీజేపీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఎలాగైనా తమ బలం పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ దశలో టీఆర్ఎస్ మునుపటిలాగే పటిష్టంగా ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: