పవన్ కల్యాణ్‌ పర్యటనకు జగన్ సర్కారు షాక్‌?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్‌ కౌలు రైతుల సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన రాయలసీమలోని కొన్నిజిల్లాల్లో పర్యటించారు. అనేక మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెం వద్ద రోడ్డును తవ్వేస్తున్న వైనం ఇప్పుడు వెలుగు చూసిందంటున్నారు. ఈ ప్రయత్నాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు.

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు రేపు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. పవన్ కల్యాణ్ చింతలపూడి రానున్న నేపథ్యంలో యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పవన్ పర్యటనకు ఆటంకాలు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని వారు చెబుతున్నారు.

ఇందుకు వారు ఉదాహరణ చూపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం, ధర్మాజీగూడెం వద్ద ఆర్ అండ్ బి రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది.  ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారని.. వారు చెబుతున్నారు. చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వారిపై తీవ్రంగా మండిపడ్డారు. రోడ్డు తవ్వుతున్న జేసీబీని మనోహర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారి యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు యాత్ర ప్రారంభమయ్యాక ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: