గవర్నర్ తో కేసీఆర్ రాజీకి సిద్ధపడతారా..?

Deekshitha Reddy
తెలంగాణలో సీఎం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత వేడెక్కింది. గతంలో పరోక్షంగా విమర్శలు సాగేవి, ఇప్పుడవి నేరుగా ఎక్కుపెట్టునే స్థాయికి వెళ్లిపోయాయి. అయితే ఏదయినా చర్చల ద్వారానే సాధ్యం అనే పద్ధతిలో కేసీఆర్, గవర్నర్ తమిళిసై తో చర్చలకు వెళ్తారా...? లేక ఈ గ్యాప్ ని ఇలాగే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను క‌లిశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. అనంతరం ఢిల్లీనుంచే ఆమె కేసీఆర్ స‌ర్కారుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆమె చెన్నైలో మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు, విమర్శలు ఎక్కుపెట్టారు. చెన్నైలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో కలిసి ప‌ని చేయ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. ప్రస్తుతం ఆమె రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారు. ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో కలసి పనిచేస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో విధులు చాలా భిన్న‌మైన‌వ‌ని అన్నారామె. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసి ప‌ని చేసిన తనకు రెండు చోట్లా భిన్నమైన వాతావరణం ఉందని చెబుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు తర్వాత కాలంలో నియంతృత్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పరోక్షంగా కేసీఆర్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళిసై. ఆ పద్ధతి మంచిది కాదని ఆమె హితవు పలికారు.
గవర్నర్ ని మార్చేస్తారా..?
తెలంగాణ బాధ్యతలనుంచి తమిళిసై ని తప్పిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జోరందుకుంది. దానిపై కూడా ఆమె స్పందించారు. తనని వేరే రాష్ట్రానికి మారుస్తారన్న ప్రచారం నిజం కాదన్నారు తమిళిసై. సీఎం చెప్పిన ప్రతి దానికి తల ఊపాల్సిన అవసరం లేదని, సీఎం పంపించిన ప్రతి ఫైలుపై గుడ్డిగా సంత‌కం చేయ‌డానికి తాను రబ్బర్‌ స్టాంప్‌ కాదని అన్నారామె. గవర్నర్‌ గా ఎవ‌రున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ పాటించాల్సిందేనని తెలిపారు తమిళి సై. రాజ్‌ భవన్‌ నుంచి వెళ్లే ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని చెప్పారామె. ప్రస్తుతం బంతి కేసీఆర్ కోర్టులో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆర్.. ఆ పార్టీ నియమించిన గవర్నర్ పై కూడా వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ గొడవను ఇక్కడితో ఆపేయాలంటే కేసీఆర్ సయోధ్య చేసుకోవాల్సిందే. లేకపోతే వివిధ వేదికలపై కేసీఆర్ గురించి మరిన్ని విమర్శలు వినాల్సి వస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: