మంత్రి రోజా వార్నింగ్ ఎవరి గురించి..?

Deekshitha Reddy
మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నగరి నియోజకవర్గానికి వచ్చారు రోజా. అక్కడ ఆమెకు భారీ స్వాగతం లభించింది. అయితే రోజా అక్కడ కొన్ని సీరియస్ డైలాగులు చెప్పారు. ఆ డైలాగులు వర్తించేది ప్రత్యర్థి పార్టీలోని వారికా లేక, సొంత పార్టీలోనే ఉన్న ప్రత్యర్థి వర్గానికా అనేది తేలాల్సి ఉంది.
ఇటీవల నెల్లూరులో కూడా మంత్రి పదవి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్, సొంత పార్టీలోనే ప్రత్యర్థులుగా భావిస్తున్నవారిపై మాటల తూటాలు పేల్చారు. రోజా కూడా అదే స్టైల్ లో సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారా అనేది తేలాల్సి ఉంది. ఇంతకీ రోజా ఏమన్నారు. ఆమె వార్నింగ్ ఇచ్చింది ఎవరికి, ఆమె టార్గెట్ ఎవరు అనేది ఇప్పుడు నగరిలో చర్చనీయాంశమైంది.
నిన్న మొన్నటి వరకు నగరి నియోజకవర్గానికే నేను పరిమితమయ్యాను, మీ ముందుకు కేవలం ఎమ్మెల్యేగానే వచ్చాను. ఇప్పుడు నేను మంత్రిగా వచ్చాను, నగరి కి నేను మంత్రిగా రావడం మీరిచ్చిన వరంగా భావిస్తానని అభినందన సభలో వ్యాఖ్యానించారు రోజా. మంత్రి పదవి చేపట్టాక మొట్టమొదటగా నగరి నియోజకవర్గానికి వచ్చిన ఆమె భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకరకంగా ఇది ఆమె బల ప్రదర్శన అంటున్నారు. పార్టీలో ఉన్న వైరి వర్గాలకు కూడా రోజా వార్నింగ్ ఇచ్చినట్టయిందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్కగా నా సత్తా ఏమిటో చూపిస్తానని రోజా చెప్పడం కూడా వైరి వర్గాలకు ఇచ్చిన వార్నింగ్ గా పేర్కొంటున్నారు. సీఎం జగన్‌ తనకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తానని, ఆర్థిక వనరులు సమకూరుస్తానని చెప్పారు రోజా. రోజాకు ఇక సీటు రాదు, రోజా పని అయిపోయిందని ఎగతాళి చేసి మాట్లాడిన వారి నోళ్లు మూయించే విధంగా నగరి ప్రజలు తనకు అందగా నిలబడ్డారని, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని గుర్తు చేసుకున్నారు రోజా. ఇకపై తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న రోజా, నగరిలో ప్రత్యర్థి వర్గానికి కూడా చెమటలు పట్టించే అవకాశముంది. ఆమధ్య స్థానిక ఎన్నికల్లో కూడా రోజాతో వైరివర్గం పోటీ పడింది, తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రోజా మినిస్టర్ గా అడుగు పెట్టడంతో ప్రత్యర్థి వర్గం కాస్త ఇబ్బంది పడే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: