అమరావతి : జగన్ మేల్కోకపోతే కష్టమేనా ?

Vijaya



షెడ్యూల్ ఎన్నికలకు ఇంకున్నది రెండేళ్ళు మాత్రమే. అధికారంలో ఉన్నపార్టీ ప్రభుత్వంలోను, పార్టీలోను ఉన్న సమస్యలను పరిష్కరించుకుని ఎన్నికలకు రెడీ అవటానికి ప్రయత్నించాలి. కానీ విచిత్రంగా వైసీపీలో అంతా రివర్సులో జరుగుతోంది. పార్టీ-ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు ఇపుడు బయటపడుతున్నాయి. నిజానికి ఇపుడు బయటపడుతున్న వివాదాలు చాలా పాతవే. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో పట్టించుకోని కారణంగా ఇపుడవే పెద్దవైపోయి రోడ్డున పడుతున్నాయి.



తాజా ఉదాహరణ నెల్లూరు రాజకీయమే. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి-మాజీమంత్రి అనీల్ కుమార్ కు ఏమాత్రం పడదు. మంత్రిగా ఉన్నపుడు అనీల్ ను కాకాణి తన నియోజకవర్గం సర్వేపల్లిలోకి అడుగే పెట్టనీయలేదు. అప్పటి విభేదాలే పెరిగిపోయి రోడ్డునపడింది. అప్పట్లోనే జగన్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసుండాల్సింది. అలాగే కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎంఎల్ఏ ఆర్ధర్ కు శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డికి ఉప్పు-నిప్పుగా ఉంది వ్యవహారం. వీళ్ళను జగన్ పిలిచి సెట్ చేస్తేకానీ పరిస్ధితి చక్కబడదు. అయినా సరే ఎందుకనో జగన్ జోక్యం చేసుకోవటంలేదు.



చిత్తూరు జిల్లా నగరిలో కూడా సేమ్ టు సేమ్. మంత్రి రోజాకు పార్టీలోని బలమైన వ్యతిరేకవర్గం తయారైంది. రోజాకు పోటీగా నియోజకవర్గంలో ప్రత్యర్ధివర్గం కార్యక్రమాలు చేపడుతోంది. రోజాకు ఏ రకంగా కూడా ప్రత్యర్ధివర్గం సహకరించటంలేదు. ఎంఎల్ఏగా ఉన్నపుడే గొడవలు పెద్దవిగా ఉండేది. ఇపుడు రోజా మంత్రయిన తర్వాత ప్రత్యర్ధివర్గం విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇపుడు గనుక జగన్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేయకపోతే రేపటి ఎన్నికల్లో రోజా గెలుపు కష్టమే. 




ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమస్యలే కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటిని ఇపుడే గనుక సెట్ రైట్ చేసుకోకపోతే రేపటి ఎన్నికలకు ఇవి బాగా పెద్దవైపోవటం ఖాయం. ఇపుడు సెట్ రైట్ కాని గొడవలు అప్పుడు అయ్యే అవకాశం తక్కువే. కాబట్టి జగన్ వెంటనే మేల్కొని మంత్రులు-ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు-నేతల మధ్య వివాదాలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే చేతులారా కొన్నినియోజకవర్గాలను చేతులారా వదులుకున్నట్లవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: