రామోజీ రావుని నేరుగా టార్గెట్ చేసిన అంబటి..

Deekshitha Reddy
గతంలో టీడీపీ అనుకూల మీడియా అనేవారు, ఆ తర్వాత ఎల్లో మీడియా అన్నారు, ఇప్పుడు నేరుగా పేరు పెట్టి చెప్పేస్తున్నారు. ఆ మూడు మీడియా సంస్థలు మనకి వ్యతిరేకం అని నేరుగా సీఎం జగనే చెప్పిన తర్వాత ఇక మంత్రులు ఊరుకుంటారా..? అందుకే అంబటి రాంబాబు, రామోజీ రావుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన అధీనంలోని పత్రిక విషం కక్కుతోందని ఆరోపించారు. ఏదో జరిగిపోతున్నట్టు ప్రజల్లో నెమ్మదిగా విషంయ ఎక్కించే పని చేస్తున్నారని విమర్శించారు అంబటి.
పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో శరవేగంతో పోలవరం పనులు జరిగాయని ఆ పత్రికలో రాసుకొచ్చారని, ఇప్పుడు మాత్రం తప్పుజరిగిపోతోందంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు అంబటి. పోలవరం ప్రాజెక్టులో పురోగతి కేవలం 1.46 శాతం మాత్రమేనని అనడం తప్పు కాక ఇంకేంటని ప్రశ్నించారు అంబటి. ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెడ్జింగ్‌ పరిష్కారంగా 800 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారనని, వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే దానికి అసలు కారణం చంద్రబాబు కమీషన్ల యావేనని అన్నారు అంబటి.
కేవలం చంద్రబాబు కమీషన్ల కోసమే.. కాఫర్‌ డ్యామ్, డయా ఫ్రం వాల్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అందుకే అవి దెబ్బతిన్నాయన్నారు అంబటి. స్పిల్‌ వే పూర్తి కాకుండానే కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌ కట్టారని అందుకే అవి దెబ్బతిన్నాయని వాటికి ఖర్చు చేసిన సొమ్ము వృథా అయిందని చెప్పారు అంబటి. గతంలో చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే వైసీపీ ప్రభుత్వం తిరిగి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని అన్నారు అంబటి. తన హయాంలో చెత్త పనులు, పిచ్చి పనులు చేసిన చంద్రబాబుని రామోజీరావు ప్రశ్నించరా.. అంటూ నిలదీశారు అంబటి. మొత్తమ్మీద ప్రస్తుతం పోలవరం పనులపై టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని చెబుతున్నారు అంబటి. కేవలం చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై అదనపు భారం పడిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: