శభాష్‌ యోగీ.. అదిరే నిర్ణయాలు తీసుకున్నాడుగా?

Chakravarthi Kalyan
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఆయన తన సొంత మంత్రులనే కట్టడి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అదిరా భాయ్... సీఎం అంటే అలా ఉండాలె అని జనం మెచ్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు  సీఎం యోగి ఆదిత్యానాథ్‌.. ఇంతకీ ఆ నిర్ణయాలు ఏంటో చూద్దామా..! ఇకపై మంత్రులు ఎవరూ తమ ప్రర్యటనల్లో ప్రైవేటు  హోటళ్లలో బస చేయొద్దట. ఎక్కడకు వెళ్లినా ప్రభుత్వ బంగ్లాలనే.. అందుబాటులో ఉన్న వసతి గృహాలనే వాడుకోవాలట. ఇలా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలన్న ఆదేశం కేవలం మంత్రులకే కాదు.. ప్రభుత్వ అధికారులకూ అదే రూల్ వర్తిస్తుందట.

అంతే కాదు.. మంత్రులు తమ పీఏలుగా తమ బంధువర్గంలోని వారిని నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇకపై అలా కుదరదు.. బంధువుల్ని పీఏలుగా పెట్టుకోవద్దని  సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సమయానికి కార్యాలయాలకు రావాలని హుకుం జారీ చేశారు యోగి ఆదిత్యానాథ్. అలాగే మధ్యాహ్న భోజన విరామ సమయం  30 నిమిషాలకు మించకూడదట. ప్రస్తుతం యూపీలోని ప్రభుత్వ ఆఫీసుల్లో లంచ్‌ బ్రేక్‌ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2గంటల వరకు ఉంది. కానీ దీన్ని అధికారులు సరిగ్గా పాటించరు.

చాలా మంది అధికారులు లంచ్‌ బ్రేక్‌ తర్వాత చాలా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తుండటం సాధారణంగా మారింది. అందుకే అలాకాకుండా అధికారులంతా 30 నిమిషాల మధ్యాహ్న భోజన విరామ సమయానికి కట్టుబడి ఉండాలని యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయట. అంతే కాదు... ఇకపై అధికారులు మూడ్రోజులకు మించి ఏ ఫైలూ పెండింగ్‌లో ఉండొద్దని ఆదేశించారు. కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు యోగి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్‌ చార్టర్‌ను అమలు చేయాలన్నారు. సీనియర్‌ అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: