కేసీఆర్ లో ఓటమి భయం ఉందా..? అందుకే పీకే రంగంలోకి దిగారా..?

Deekshitha Reddy
తెలంగాణ లో టీఆర్ఎస్ కి తిరుగులేదు, కేసీఆర్ మాటకు ఎదురు లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో ఉంది. తెలంగాణలో ఇప్పుడల్లా ఎన్నికలు లేవు, టైమ్ బాగానే ఉంది, కానీ అక్కడ చకచకా జరుగుతున్న రాజకీయ పరిణామాలు టీఆర్ఎస్ కి కాస్త ఇబ్బందిగానే ఉన్నాయి. వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం తగ్గడంతో గులాబీ శ్రేణులు కాస్త దిగులు పడ్డాయి. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కినా కూడా బీజేపీ పక్కలో బల్లెంలా మారిందనే భయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కూడా టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్.
తెలంగాణలో టీఆర్ఎస్‌ ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకే పీకే రంగంలోకి దిగారని విమర్శిస్తున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే పీకేతోపాటు ప్రకాష్ రాజ్ కూడా కేసీఆర్ తరపున రంగంలోకి దిగారని ఈటల ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే కేసీఆర్, పీకేను తీసుకొచ్చారని, ఆయనతో సర్వేలు చేయించుకుంటున్నారని, రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారని అన్నారు. పీకే కాదు కదా ఎవరు వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని ఆపలేరని అన్నారు ఈటల. ఆ విషయాన్ని పీకేనే స్వయంగా కేసీఆర్ కి చెప్పారని, అందుకే ఆయన కిందామీదా పడుతున్నారని అన్నారు. రైతులతో చెలగాటమాటిదే.. కేసీఆర్ మాడి మసైపోతారని దుయ్యబట్టారు ఈటల రాజేందర్. ఐటీలు, పరిశ్రమలు తెలంగాణలో ఉన్నా కూడా.. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు నివసించేది గ్రామాల్లోనేనని చెప్పారు ఈటల. వరి సాగు చేయకూడదంటూ కేసీఆర్ హుకుం జారీ చేస్తే రైతాంగం బిక్కు బిక్కు మంటోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు కేసీఆర్ విధానాల వల్ల పౌల్ట్రీ రంగం పూర్తిగా నష్టాల్లో ఉందన్నారు ఈటల. పౌల్ట్రీ రంగంలోని రైతులకు మక్కలు కూడా  దొరకడం లేదన్నారు ఈటల. కేసీఆర్‌ కి విజన్‌ లేదని విమర్శించారు ఈటల. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొనే కేసీఆర్ రుణమాఫీ, రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆయనపై కూడా కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు ఈటల.అయితే కేసీఆర్ మాత్రం రైతాంగాన్ని అయోమయంలో పడేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి.. ఏ పంటలు ఎప్పుడు వేయాలనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు ఈటల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: