జగన్ భుజంపై గన్.. కేసీఆర్ కి కేంద్రం గురి..

Deekshitha Reddy
ఏపీ, తెలంగాణ ఇరుగు పొరుగు రాష్ట్రాలు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య విభేదాలేవీ లేవు. ఆమధ్య ఇద్దరూ బాగా ఆప్యాయత పంచుకున్నారు కానీ, ఇటీవల ఎందుకో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కానీ ఎక్కడా ఎప్పుడూ ఎవరూ బయటపడలేదు. మంత్రులు విమర్శలు చేసుకున్నా.. ముఖ్యమంత్రులు మాత్రం గుంభనంగానే ఉన్నారు. ఈ దశలో కేంద్రంతో ఒకరు సఖ్యత కోరుకుంటే, మరొకరు విభేదించారు. దీంతో మరోసారి కేసీఆర్, జగన్ మధ్య ఎడబాటు ఎక్కువైంది.
రంగంలోకి కేంద్రం..
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం మొదలు పెట్టారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శల దాడి చేస్తున్నారు. అయితే అదే సమయంలో జగన్ మాత్రం కేంద్రాన్ని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఏపీకి విభజన హామీ ఉన్నా కూడా నేరుగా విమర్శించలేదు.  ఇక తాజాగా కేంద్రం కూడా జగన్ పై ప్రేమాభిమానాలను ఎక్కువగా చూపుతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కి ఒక్క రోజులోనే ప్రధాని నరేంద్రమోదీ.. ముగ్గురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో కేసీఆర్ కూడా ఢిల్లీలో మకాం వేసినా తెలంగాణ-కేంద్రం మధ్య మాత్రం పరిస్థితి మాత్రం ఇంకా గంభీరంగానే ఉంది.
జగన్ భుజంపై గన్ పెట్టి..
కేంద్రం ఇప్పుడు కేసీఆర్ ని టార్గెట్ చేస్తోంది. పరోక్షంగా ఏపీకి సాయం చేసినట్టు బిల్డప్ ఇస్తూ.. కేసీఆర్ ని టార్గెట్ చేయాలని ప్లాన్ వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి సపోర్ట్ చేసి, మరో దాన్ని పక్కనపెడితే కచ్చితంగా ఆ ప్రభావం తెలంగాణలో కనపడుతుంది. ఏపీ లాగే తెలంగాణకు కూడా సాయం చేయాలంటే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉండాలనే విషయాన్ని హైలెట్ చేయొచ్చు. లేదా కేసీఆర్ తమకి సహకరించడంలేదని, అందుకే తెలంగాణ నష్టపోతుందనే ప్రచారం కూడా చేయొచ్చు. మొత్తానికి జగన్ ని బుజ్జగిస్తూ, ఏపీని దగ్గరకు తీసుకుంటున్నట్టు కలరింగ్ ఇచ్చి, తెలంగాణను మాత్రం కేంద్రం టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. అటు కేసీఆర్ కూడా కేంద్రంతో యుద్ధాన్నే కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆయన, బీజేపీని టార్గెట్ చేశారు. తెలంగాణలో బీజేపీని అణగదొక్కడంతోపాటు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్. మోదీ వ్యూహం ఫలిస్తుందా, కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: