మరో వారంలో పెట్రోల్ రేటు మీరు ఊహించలేనంత..!

Deekshitha Reddy
రెండు వారాల్లోనే పెట్రోల్ రేట్లను 13 సార్లు పెంచింది కేంద్రం. కొంచెం కొంచెంగా వడ్డించుకుంటూ దాదాపు 11 రూపాయల మేర పెంచేసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లను భారీగా పెంచుకుంటూ పోతున్న కేంద్రం దాన్ని ఎక్కడ ఆపుతుంది. ఈ బాదుడుకి బ్రేక్ ఎక్కడ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కానీ కేంద్రం చెబుతున్న మాటలు వింటుంటే రాబోయే రోజుల్లో సామాన్యులకు చుక్కలు కనిపించక మానవు. ఆ రేంజ్ లో భారత్ లో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయని అంచనా.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం కారణంగా భారత్ లో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి. పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలకు ఆయన బదులిచ్చారు. అయితే ధరల పెరుగుదలపై చర్చ జరిపేందుకు మాత్రం కేంద్రం వెనకడుగు వేసింది. కేవలం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయనే విషయం చెప్పి సరిపెట్టుకుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి. అయితే ఇతర ప్రపంచ దేశాల్లో ఈ రేట్లు భారీగా పెరిగాయని, కేవలం భారత్ లో మాత్రమే కంట్రోల్ లో ఉన్నాయని అంటున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు ఎకా ఎకిన 50శాతం పెరిగాయని చెబుతోంది కేంద్రం. వాటితో పోల్చి చూస్తే భారత్ లో పెరుగుదల 5 శాతం మాత్రమే ఉందని అంటున్నారు.
వాస్తవానికి ఒకేసారి ఇంధన రేట్లు భారీగా పెరుగుతాయని అనుకున్నా.. మెల్ల మెల్లగా డోసు పెంచుకుంటూ పోతోంది కేంద్రం. రెండు వారాల్లో ఏకంగా 13 సార్లు పెంచింది. రికార్డ్ స్థాయికి చేర్చింది. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. కేంద్రం ఇచ్చిన హింట్  ప్రకారం భారత్ లో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు ఇంకా 45శాతం మేర పెంచుకోవచ్చనమాట. ఇతర దేశాల్లో 50శాతం పెరిగాయి, మన వద్ద కేవలం 5శాతమేనంటూ కేంద్ర మంత్రి చెప్పారంటే ముందు ముందు ఈ బాదుడు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: