రాయలసీమ : రోజా బుక్కయిపోయినట్లేనా ?

Vijaya



రాజకీయంగా నగిరి ఎంఎల్ఏ రోజా బుక్కయిపోయినట్లే ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న నగిరిని ఎలాగైనా తిరుపతి జిల్లాలోకి మార్పించుకోవాలని రోజా శతవిధాల ప్రయత్నించారు. అయితే చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో రోజా చిత్తూరు జిల్లాలోనే కంటిన్యు అవకతప్పటంలేదు. ఇంతకీ చిత్తూరు జిల్లాలో నుండి రోజా తిరుపతి జిల్లాలోకి నగిరిని ఎందుకు మార్చుకోవాలని అనుకున్నారు ? ఎందుకంటే పుంగనూరు కూడా చిత్తూరు జిల్లాలో ఉండటమే ఏకైక కారణం.



పుంగనూరంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఇఫుడు రోజా, పెద్దిరెడ్డి ఒకే జిల్లాలో ఉన్నారు. సమస్య ఏమిటంటే పెద్దిరెడ్డి ఉన్నంతవరకు రోజా రాజకీయ జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. ఎంఎల్ఏ టికెట్ తెచ్చుకోవటం వరకు రోజాకు ఎలాంటి సమస్యా ఉండదు కానీ ఆ తర్వాత మాత్రం ఎంఎల్ఏకి అన్నీ సమస్యలే. గెలుపే పెద్ద సమస్య అయితే తర్వాత మంత్రివర్గంలో చోటు అన్నది రోజాకు కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి అనేక కారణాలతోనే పెద్దిరెడ్డిని తప్పించుకునేందుకు తన నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చుకునేందుకు రోజా ప్రయత్నాలు చేసి చేసి ఫెయిలయ్యారు.



పెద్దిరెడ్డి ఉన్నంతవరకు రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమేలేదు. అదే సమయంలో నియోజకవర్గం నుండి ఎవరినైనా కార్పొరేషన్ పదవుల్లో నియమించుకోవాలన్నా రోజాకున్న అవకాశాలు తక్కువే. ఎందుకంటే నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న గట్టి సీనియర్ నేతలంతా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఎంఎల్ఏగా రోజా గెలవాలంటే  పెద్దిరెడ్డి మద్దతుండాల్సిందే.  జగన్ టికెట్ ఇవ్వగలరే కానీ క్షేత్రస్ధాయిలో కూర్చుని గెలిపించలేరు.



ఆపని చేయాలంటే పెద్దిరెడ్డి సహకారం చాలా అవసరం. నగిరి నియోజకవర్గంలో జగన్ కానీ పెద్దిరెడ్డి కానీ జోక్యం చేసుకోకుండా వదిలేస్తే రోజా గెలుపు కష్టమే. అందుకనే పెద్దిరెడ్డితో రోజాకు సఖ్యతగా ఉండక తప్పదు. జగన్ అయినా పెద్దిరెడ్డిని కాదని రోజాకు అవుట్ రైట్ మద్దతుగా నిలబడలేరు. ఇలాంటి అనేక కారణాల వల్ల పెద్దిరెడ్డి ముందు రోజా బుక్ అయిపోయినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: