హైదరాబాద్ : బీజేపీ ఆశలన్నీ వీళ్ళపైనేనా ?

Vijaya


ముందస్తు ఎన్నికలు ఖాయమని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో పోటీ చేయబోయే అభ్యర్ధులపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రత్యేక దృష్టంటే పార్టీ తరపున నేతలను రెడీ చేసుకుంటోందని అపోహపడకండి. పక్కపార్టీల నేతలపైనే దృష్టిపెట్టింది. అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలకు గాలమేస్తోంది. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుతో కమలంపార్టీలో మంచి జోష్ కనబడుతోంది.



ఎక్కడో ఉత్తరాధిలో బీజేపీ గెలిస్తే ఇక్కడ దక్షిణాదిలో  హాడావుడేమిటో బీజేపీ నేతలకే అర్ధంకావాలి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటు కేసీయార్ కు కమలంపార్టీ నేతలు ప్రతిరోజు తొట్టికొట్టి మరీ చెబుతున్నారు. ఇంతకీ 119 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులున్నారా ? అని అడగ్గూడదు. ఎందుకంటే బీజేపీకి అంత సీన్ లేదని అందరికీ తెలుసు. మొన్నటి ఎన్నికల్లో పోటీచేస్తే 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే దొరకలేదు. మామూలుగా అయితే రేపటి ఎన్నికల్లో అయినా ఇదే పరిస్ధితి. అందుకనే పక్క పార్టీల నేతలకు గాలమేస్తున్నారు కమలనాదులు. 



పోనీ పోటీచేసిన వాళ్ళల్లో గెలిచిందెంతమంది ? ఎంతమందంటే ఒకే ఒక్కడు. అవును ఓల్డ్ సిటిలోని గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. ఈమధ్యనే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. ఇంతోటిదానికే బీజేపీ నేతలు అసలు నేలపైన నిలవటంలేదు. చరిత్రను బాగానే గుర్తుపెట్టుకున్నారు కాబట్టే ఈసారి పక్కాగా బరిలోకి దిగుదామని అనుకుంటున్నారు. అందుకనే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు గాలమేస్తున్నారు.



ఇందులో భాగంగానే మహబూబ్ నగర్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లోని అసంతృప్త నేతలతో కమలనాదులు టచ్ లో ఉంటున్నారట. అందుకనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో చేరుతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. మొత్తానికి ఇలాంటి వలపనేతలే కనీసం ఓ 80 మందన్నా అవసరమవుతారు. ఇంతమందిని చేర్చుకోకపోతే అధికారంలోకి రావటం సంగతి దేవుడెరుగు అసలు అన్నీ నియోజకవర్గాల్లోను పోటీకి దిక్కుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: