ఇదీ పవన్‌ మేనిఫెస్టో: వారి ఖాతాల్లో రూ.10 లక్షలు?

Chakravarthi Kalyan
ఏపీలో అప్పుడే ఎన్నికల కాక మొదలైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఈ ఎన్నికల రేసు అప్పుడే ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేళ ఆయన తన మేనిఫెస్టోను చూచాయగా ప్రకటించేశారు. ఏపీని వైసీపీ నుంచి కాపాడటమే తన మొదటి కర్తవ్యం అని చెప్పిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమాగా చెప్పారు. ఇదే సమయంలో జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ తన మేనిఫెస్టోను ఈ సభ ద్వారా ప్రకటించినట్టయింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల్లో అన్నింటి కంటే ముఖ్యమైంది యువతకు ఉద్యోగ అవకాశాలు.  యువతకు సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలు కాకుండా.. వారు సొంత కాళ్లపై నిలబడే ఉపాధి మార్గాలు తయారు చేస్తామన్నారు. యువత ఉపాధి కోసం అర్హులైన వారికి రూ.10లక్షలు అందిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సాగు రంగాన్ని లాభసాటిగా మారుస్తామని.. అందుకోసం మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కుల ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మన ఏపీ మన ఉద్యోగాలే నినాదంగా ముందుకు వెళ్తామని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామని.. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. సీపీఎస్ పై గతంలో జగన్ హామీ ఇచ్చి అమలు చేయలేదని.. కానీ.. తాము అధ్యయనం చేసిన తర్వాతే హామీ ఇస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

అప్పుల్లేనే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతానని.. మెరుగైన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తానని పవన్ ప్రకటించారు. విశ్వనగరంగా విశాఖపట్నం, హైటెక్ సిటీలుగా విజయవాడ, తిరుపతి అభివృద్ధి చేస్తామని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా ఉంటుందని.. రాయలసీమ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉంటే.. ఫ్రీగా ఇసుక ఇస్తామన్నారు. వైసీపీది విధ్వంసం.. జనసేనది వికాసం.. వైసీపీ అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ అన్నారు పవన్ కల్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: