హైదరాబాద్ : దెబ్బకు కేసీయార్ దిగొచ్చారా ?

Vijaya



ఒకవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళనలు. మరోవైపు ఉద్యోగాల భర్తీ పేరుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష. ఇంకోవైపు నోటిపికేషన్ల డిమాండ్ తో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్యమం. అన్నింటికీ మించి జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. వీటన్నింటి ఫలితంగానే అసెంబ్లీలో కేసీయార్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. 91,142 వివిధ స్ధాయిల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీయార్ ప్రకటించారు.



ఉద్యోగాల భర్తీకి బుధవారం నుండే వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు కేసీయార్ చాలా ఆర్భాటంగా అసెంబ్లీలో ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన, కార్యాచరణ మొదలవ్వాల్సింది దాదాపు ఏడేళ్ళక్రితమని అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలైందే నీళ్ళు, నియామకాల పేరుతో. నీళ్ళు కాస్త అటు ఇటుగా తెలంగాణాకు అందుతున్నాయని, నియమాకాలు చేయనీయకుండా ఉద్యమమే అడ్డుకుంటోందని అప్పటి పాలకులు చెప్పారు.



దాంతో తెలంగాణా ఉద్యమం నినాదం ఆత్మగౌరవం అని మారింది. కేసీయార్ సీఎం అయిన దగ్గర నుండి ఏదో సందర్భంలో ఉద్యోగాల భర్తీ చేస్తానని, నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు మాటలు చెప్పటమే కానీ చేతల్లో చూపలేదు. నిరుద్యోగులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీయార్ స్పందించలేదు. అలాంటిది హఠాత్తుగా ఎందుకని వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేస్తున్నట్లు ప్రకటించారు ? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై అనుమానంతోనే అని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్న వాస్తవమే. 





లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా భర్తీ చేయని ఉద్యోగాలను ఒక్కసారిగా నోటిఫికేషన్లంటు ప్రకటన చేసే వారేకాదు. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్సే గెలుస్తుందనే నమ్మకం కేసీయార్లో ఉండుంటే ఇపుడు కూడా ఉద్యోగాల భర్తీ ఉండేది కాదేమో. నిరుద్యోగులను, విద్యార్ధులను ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ఆకట్టుకుంటున్నాయనే రిపోర్టు అందటం వల్లే హడావుడిగా నోటిఫికేషన్ల ప్రకటన చేశారు. అంటే ఏ విషయంలో అయినా ఒత్తిడి పెడితేనే కేసీయార్ దిగొస్తారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: