రేవంత్ వార్నింగ్‌: ఈసారి అధికారం మాదే.. మీ సంగతి చూస్తా?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకే వార్నింగ్ ఇచ్చేశారు. బీహార్‌కు చెందిన అధికారుల ముఠా రాష్ట్రంలో అరాచకాలు చేస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సంఘం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండించింది. అయినా సరే రేవంత్ రెడ్డి మాత్రం తన విమర్శల జోరు తగ్గించనే లేదు. తాజాగా ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్‌ రెడ్డి  కేసీఆర్‌కు లేఖ రాశారు. ఐపీఎస్‌ అధికారుల మాటలు ఏమాత్రం విశ్వసించేలా లేవంటున్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణను మరో బీహార్‌లా మారుస్తున్నారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సంఘాలు
డీజీపీ మహేందర్‌రెడ్డి ఒత్తిడితోనే ప్రకటన విడుదల చేశాయని రేవంత్‌ రెడ్డి రెడ్డి అంటున్నారు. డీజీపీ తన మెడికల్ రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి.. ఐఏఎస్ సంఘం కూడా బిహార్ ముఠా చేతిలోనే ఉందని మండిపడ్డారు.

ఈ సారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు అతి చేసే అధికారుల సంగతి చూస్తామని  రేవంత్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాయంటున్న రేవంత్‌ రెడ్డి.. రాష్ట్రాభివృద్ధిలో మేధావి వర్గం భాగస్వామ్యం ఉంటుందని ఆశించినా అది సాకారం కాలేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామని రేవంత్‌ రెడ్డి అంటున్నారు.

తెలంగాణలో కీలకమైన శాఖలన్నీ బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయన్న రేవంత్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు, అధికారులు బిహారీలేనని పునరుద్ఘాటించారు. ఉద్యమంలో కీలకంగా పని చేసిన అధికారులకు ఆదరణ కరవైందని.. రేవంత్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్, 139 మంది ఐపీఎస్‌లు ఉన్నారని కానీ.. వీరిలో రాష్ట్రానికి చెందిన అధికారులున్నా ఎందుకు బిహారీలకే ప్రాధాన్యమెందుకు ఇస్తున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: