అమ్మఒడి అగిపోయినట్టేనా..? అసలేం జరిగింది..?

Deekshitha Reddy
సరిగ్గా ఏడాది క్రితం సంక్రాంతి సెలవలకు ముందే అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో పడిపోయాయి. సంక్రాంతికి పిల్లలకు కొత్త బట్టలు, ఇతరత్రా కార్యక్రమాలకు ఆ సొమ్ము బాగా ఉపయోగపడింది. అటు తల్లుల హ్యాపీ, ఇటు కరోనా కష్టకాలంలో వ్యాపార వర్గాలు హ్యాపీ. పాలన అంటే ఇలా ఉండాలి, అంటూ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఏడాది తర్వాత ఈసారి సంక్రాంతికి అమ్మఒడి సొమ్ము ఖాతాల్లో జమకాలేదు. అసలా ఊసే లేదు. ఇప్పుడెందుకు ఈ సమస్య. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అమ్మఒడి ఆలస్యం చేశారా..? చేయూత కూడా వెనక్కి వెళ్లిపోయిందంటున్నారు. అసలు పథకాల అమలుకి సరిపడా నిధులు ఖజానాలో ఉన్నాయా..? లేవా..?
సంక్రాంతికి అమ్మఒడి డబ్బులు పడతాయని చాలామంది తల్లులు ఆశగా ఎదురు చూశారు కానీ అది కుదరలేదు. పోనీ ఎప్పుడిస్తారనేదానిపై కూడా క్లారిటీ లేదు. అమ్మఒడి పథకానికి పిల్లల హాజరుని జతకలపడం సహా, ఇతరత్రా నిబంధనలు కఠినతరం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో అమ్మఒడి ఆలస్యం అయిందని అంటున్నారు. ఇకపై ప్రతి ఏడాదీ వేసవిలో అమ్మఒడి ఆర్థిక సాయం విడుదల చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
ప్రతిపక్షాలేమంటున్నాయి..?
గతంలో అమ్మఒడి వంటి పథకాలను తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్షాలే ఇప్పుడు ఆ డబ్బులు ఎందుకు సకాలంలో జమ చేయలేదని ప్రశ్నిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆర్థికసాయం చేసి ఉంటే.. అందరి కుటుంబాల్లో సంతోషం వెల్లి విరిసేదని అంటున్నారు కొంతమంది నేతలు. మరి ప్రభుత్వం ఈ కార్యక్రమంపై ముందస్తుగా కసరత్తు చేయలేదా, లేక వేసవి సెలవలు ఇచ్చేలోగా అమ్మఒడి డబ్బుని అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందా..? అధికారిక వివరణ అయితే ఇంకా బయటకు రాలేదు. మొత్తమ్మీద సంక్రాంతికి అమ్మఒడి సొమ్ములయితే తల్లుల ఖాతాల్లో పడలేదు. దీంతో ఒకరకంగా పండగ సందడి తగ్గిందనే చెప్పాలి. సరిగ్గా ఏడాది క్రితం పండగ హడావిడి బాగా ఉంది, ఈసారి కరోనా కేసులు పెరగడంతోపాటు.. పేదలకు సకాలంలో డబ్బులు చేతికి అందక ఆ సందడి తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: