పంజాబ్‌: కేజ్రీవాల్ పిలుపుకు దిమ్మ తిరిగే రెస్పాన్స్..?

Chakravarthi Kalyan
పంజాబ్‌లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. అయితే రెండుసార్లు వరుసగా సీఎం పదవిలో ఉన్న అమరీందర్‌ సింగ్‌ చివరి కాలంలో సీఎం సీటును నుంచి తప్పించడంతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీఎం చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఇద్దరూ కాంగ్రెస్‌ను మరోసారి విజయ తీరాలకు చేరుస్తారా అన్నది అనుమానమే. విచిత్రం ఏంటంటే.. అక్కడ ప్రస్తుతం ఏ పార్టీ కూడా తమదే విజయం అని నమ్మకం చెప్పలేని పరిస్థితి.

అయితే.. ఉన్నంతలో పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ జోరు చూపిస్తోంది. ఇప్పటికే దిల్లీలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పడు దిల్లీ వెలుపల కూడా ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేసి 20 వరకూ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే.. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీలు మారిపోయారు. అయినా సరే.. ఆప్‌ సంస్థాగతంగా బలపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తూ వస్తోంది. దాని ఫలితంగానే ఇటీవల చండీగఢ్‌ మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంచలనం సృష్టించేందుకు కేజ్రీవాల్ పట్టుదలగా పని చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు వచ్చిన స్పందన చూస్తుంటే.. పంజాబ్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్ మ్యాజిక్ చేయబోతున్నారేమో అనిపించక మానదు. సీఎం అభ్యర్థి ఎంపిక కూడా అరవింద్ కేజ్రీవాల్‌ వినూత్నంగా చేస్తున్నారు. మీ సీఎంను మీరే ఎన్నుకోండి అంటూ ఆప్‌ ఓ ప్రయోగం చేసింది. నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది.

కేజ్రీవాల్ చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మాకు ఈయన సీఎంగా కావాలి అంటూ 24 గంటల్లో 8 లక్షల సందేశాలు వచ్చాయని ఆప్‌ చెబుతోంది. ప్రజలు తమ అభిప్రాయం చెప్పేందుకు ఫోన్‌కాల్, వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌ వంటి అవకాశాలు ఉంచారు. రేపు సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఉంది. ఆ తర్వాత ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని కేజ్రీవాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aap

సంబంధిత వార్తలు: