జాబ్ టుడే : కేసీఆర్ చెప్పాడంటే చేస్తాడంతే! కానీ...

RATNA KISHORE
ఖాళీలు తేల‌నిదే కొత్త ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని కేసీఆర్ చెబుతున్నారు.ఇందుకోసం ఉపాధ్యాయ వ‌ర్గాల కోసం 317 జీఓ ఒక‌టి ఇష్యూ చేసి, జిల్లాల వారిగా ఖాళీల లెక్క తేలుస్తున్నామ‌ని అంటున్నారు. కానీ జోన‌ల్ పోస్టులు లెక్క ఇంత‌వ‌ర‌కూ తేల్చ‌లేకపోయారు. పోనీ క‌నీసం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాల్లో అయినా ఉద్యోగాలు చూపిస్తున్నారా అంటే అదీ లేదు. కేవ‌లం ఎన్నిక‌ల హామీలు అన్నీ నీటి మీద రాత‌ల‌య్యాక కేసీఆర్ ను మ‌ళ్లీ ఎలా న‌మ్మాలి అని నిరుద్యోగులు ఆవేద‌న చెందుతున్నారు. ఆత్మ‌హ‌త్య‌ల తెలంగాణ‌కు  కేసీఆర్ మాత్ర‌మే కార‌ణ‌మ‌ని వీరంతా అంటున్నారు. ఒక‌నాడు నీళ్లు నిధులు నియామ‌కాలు అని చెబుతూ ఉద్య‌మం చేశామ‌ని, కానీ ఇప్పుడు అవేవీ అమ‌ల్లో లేకా నిండా మునిగి మోస‌పోయామ‌ని వీరంతా గ‌గ్గోలు పెడుతున్నారు. అటు రైతులు ఇటు నిరుద్యోగులు ఎవ్వ‌రూ కూడా ఇవాళ ఈ పండుగ పూట సంతృప్తిగా లేర‌న్న‌ది విప‌క్షాల వాదన కూడా!
35 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు ఏదో ఒక‌టి చేసి ఉపాధి మార్గం చూపాలి. అంద‌రికీ కాక‌పోయినా కొంద‌రికి అయినా ప్ర‌భుత్వం త‌ర‌ఫున భ‌రో్సా ఉండాలి.ఇవేవీ లేన‌ప్పుడు క‌నీసం ఇస్తామ‌న్న 3016 రూపాయ‌ల నిరుద్యోగ భృతిని అయినా ఇవ్వాలి. ఇవేవీ కాకుండా కాల‌యాప‌న చేసి నిరుద్యోగులు నిండా ముంచుతున్నారు కేసీఆర్ అన్న అభియోగం మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తూనే ఉంది. నిరుద్యోగం లేని తెలంగాణ‌ను ఆశించే తాము ఆ రోజు ఓయూ కేంద్రంగానో, కాక‌తీయ వ‌ర్శిటీ కేంద్రంగా ఉద్య‌మాలు తీవ్ర‌త‌రం చేశామ‌ని కానీ ఇప్పుడు సొంత రాష్ట్రం వ‌చ్చాక సొంత పాల‌కులే త‌మ పొట్ట కొడుతున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు వాపోతున్నాయి.

తెలంగాణ రాజ‌కీయాల్లో కేసీఆర్ కు ఎదురే లేదు. ఆయ‌నను ఢీ కొనే శ‌క్తే లేదు. అంత‌గా పాతుకుపోయిన టీఆర్ఎస్ కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉన్నాయి.అవేవీ కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉన్నాయి.రాజకీయంలో అప‌ర చాణ‌క్య నీతిని పాటించే గులాబీ బాస్ ఎందుక‌నో కొన్ని విష‌యాల్లో దూకుడుగా లేరు.ముఖ్యంగా ఆర్థిక సంబంధ విష‌యాల్లో కేసీఆర్ మాత్రం అస్సలు సాహ‌సం చేసి ఓ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు.దీంతో నిరుద్యోగ స‌మ‌స్య అన్న‌ది అస్స‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. ఆ రోజు ఎన్నిక‌ల్లో ఇస్తామ‌న్న హామీ ఇప్ప‌టిదాకా అమ‌ల్లో లేదు.అంతేకాదు కొత్త‌గా ఒక్క‌టంటే ఒక్క నోటిఫికేష‌న్ కూడా లేదు. ఇస్తార‌న్న భ‌రోసా కూడా ప్ర‌భుత్వం నుంచి రావ‌డం లేదు. ఈ ద‌శ‌లో కేసీఆర్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు నిరుద్యోగ సమ‌స్య అన్న‌ది ముందున్న రోజుల్లో పెద్ద అవ‌రోధం అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: