న‌ర‌సాపురం పాలిటిక్స్‌లో ఆర్ ఆర్ ఆర్ ప్ల‌స్‌లు.. మైన‌స్‌లు

VUYYURU SUBHASH
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పాలిటిక్స్ మారుతున్నాయా? ఇక్క‌డ మ‌రోసారి ఎన్నిక‌లు రానున్నా యా? వ్యూహాలు అదిరిపోనున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019లో ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ‌రాజు.. వైసీపీతో విభేదించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పార్టీలోనే ఉంచినా.. ఎంపీగా అన‌ర్హుడిని చేయాల‌ని.. వైసీపీ భావిస్తోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇది సాధ్యం కాలేదు. అయితే..తానేరాజీనామా చేస్తాన‌ని.. ఇటీవ‌ల ర‌ఘురామ ప్ర‌క‌టించారు.
దీనికి ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దీంతో ఆయ‌న రాజీనామా చేయ‌డంతో వ‌చ్చే ఆరుమాసాల్లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. ఇక్క‌డ మ‌రోట్విస్ట్ కూడా.. అమ‌రావ‌తి అజెండాతో తాను ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించారు. సో.. మొత్తానికి ఆయ‌న రాజీనామా చేయ‌డం.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం అనేది ఖాయ‌మైపోయింది. అయితే.. ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తారు?  ఒంట‌రిగా వెళ్తారా.. లేక బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తారా? అనేది కూడా చ‌ర్చ‌గా మారింది.
తాజాగా ర‌ఘురామ చేసిన వ్యాఖ్య‌ల‌ను చూస్తే.. జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. కాపు సామాజిక వ‌ర్గం.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలో జ‌న‌సేన అండ‌తో ఎన్నిక‌ల‌కు వెళ్తే.. గెలుపు గుర్రం ఎక్కేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. రాజు భావిస్తున్నార‌ని.. రాజ‌కీయ చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను ప‌రిశీలిస్తే.. గ‌డిచిన రెండేళ్లుగా వివిధ కార‌ణాల‌తో ర‌ఘురామ రాజు.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇక్క‌డ‌.. అభివృద్ధి చేస్తున్నానని.. అంతా ఢిల్లీ నుంచే న‌డిపిస్తున్నాన‌ని ఆయ‌న చెబుతున్నారు.
కానీ, ఎంత అభివృద్ధి చేసినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుడు ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌క‌పోతే.. ఆ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది ర‌ఘురామ‌కు భారీ మైన‌స్ అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా.. ఆయ‌న అమ‌రావ‌తి ఎఫెక్ట్‌తో ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని చెబుతున్నారు. ప‌శ్చిమ‌లో ప్ర‌జ‌లు ఏది రాజ‌ధాని అయినా..ఒక‌టే అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా.. ఇక్క‌డ వైసీపీ నేత‌ల దూకుడు ఎక్కువ‌గా ఉంది. క్షేత్ర‌స్థాయిలో వారి హ‌వానే న‌డుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ర‌ఘురామ‌కు ప్ల‌స్సులు క‌న్నా.. మైన‌స్‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: