హైదరాబాద్ : ‘ఆస్క్ కేటీయార్’ అనగానే షాకిచ్చిన నెటిజన్లు

Vijaya


ట్విట్టర్ ద్వారా ఆస్క్ కేటీయార్ అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంటుంది తెలంగాణాలో.  కేటీయార్ అంటే ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెటిజన్లు తమ సమస్యలను, ప్రశ్నలను ట్విట్టర్ ద్వారా కేటీయార్ కు సంధిస్తే ఆయన కూడా ట్విట్టర్ ద్వారానే సమాదానాలిస్తారు. ఇలాంటివి కేవలం వ్యక్తిగతంగా ఇమేజి పెంచుకునేందుకు తప్పించి ఇంక దేనికీ పనికిరాదు. ఇలాంటి తాజా కార్యక్రమంలో కొందరు నెటిజన్లు కేటీయార్ ను ఫుల్లుగా వాయించిపడేశారు.



రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను, కేసీయార్ ఇచ్చిన హామీలు తదితరాలను ప్రధానంగా ప్రస్తావించటం ద్వారా కేటీయార్ ను ఇరుకునపడేశారు. దాంతో వాళ్ళ ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో తెలీని కేటీయార్ అసలా ప్రశ్నలతో తనకేమీ సంబంధం లేదన్నట్లే సమాధానాలు చెప్పకుండా వదిలేశారు. ఏదో ఫైబర్ ఇంటర్నెట్, ఐటి రంగం, యూపీలో బీజేపీ పరిస్ధితి, కోవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ పెట్టడం, విపక్షాల అసత్య ప్రచారాలను ఎలా ఎదుర్కొంటారు ? లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాలివ్వటం గమనార్హం.



కేటీయార్ ను బాగా ఇబ్బంది పెట్టిన ప్రశ్నలు ఏవంటే దళితబంధు పథకం అమలు ఎప్పటి నుండి ? అని అడిగారు. నవంబర్ 4 నుండి అమలు చేస్తానన్న పథకాన్ని ఇంకా ఎందుకని అమలు చేయలేదని నిలదీశారు. కేసీయార్ తీరుచూస్తుంటే హుజూరాబాద్ లో ఓడిపోయిన కారణంగా పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉందంటు ఘాటుగానే వాయించారు. ధరణి సమస్యలను ఎందుకు పట్టించుకోవటంలేదంటు చాలామంది నిలదీశారు.



ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పీ ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు నష్టపరిహారం కోసం నెలల తరబడి ఎందుకు ఎదురు చూడాలంటు గట్టిగా ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన వనమా రాఘవను ఎప్పుడు ఎన్ కౌంటర్ చేస్తారంటు కొందరు నెటిజన్లు నిలదీశారు. సొంత స్ధలంలో పేదలు ఇళ్ళు కట్టుకుంటే రు. 5 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని అడిగారు.



కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని ఎందుకు గాలికొదిలేశారంటు నెటిజన్లు భగ్గుమన్నారు. వరిసాగు చేయవద్దని రైతులకు చెబుతున్న కేసీయార్ తన ఫాంహౌస్ లో 150 ఎకరాల్లో వరి ఎందుకు సాగు చేస్తున్నారన్న ప్రశ్నలకు కేటీయార్ మౌనమే సమాధానమైంది. నెటిజన్ల నుండి వచ్చిన ఇలాంటి అనేక ప్రశ్నలకు కేటీయార్ ఏమీ సమాధానం ఇవ్వలేకపోయారు. కొన్ని ప్రశ్నలకైతే ఏమని సమాధానం చెప్పాలో కూడా కేటీయార్ కు అర్ధంకాక షాక్ కొట్టినట్లయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: