కరోనా... రాబోయే రెండు నెలలు హై అలర్ట్...!

Podili Ravindranath
కరోనా పట్ల రాబోయే రెండు నెలలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అందరూ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేసి జిల్లాలో తదుపరి వ్యాప్తి నివారణకు కృషి చేయాలని ఆయన తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యల పట్ల కోవిడ్ నోడల్ అధికారులు, ఆసుపత్రుల నోడల్ అధికారులతో  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పలు కీలక సూచనలు చేశారు. అలాగే జిల్లాలోని ఆసుపత్రుల పరిస్థితి, వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. వైరస్ కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. కంటైన్మెంట్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇచ్ఛాపురం నుండి టెక్కలి వరకు సేకరించిన నమూనాలు టెక్కలిలో పరీక్ష చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షల నమూనాలు నిర్దేశిత సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుటకు అవసరమైతే రవాణా మెరుగు పరచాలని మంత్రి ఆదేశించారు. నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. లోపాలు జరిగితే బాధ్యత వహిస్తారని... శాఖాపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు కలెక్టర్ లాఠకర్. కోవిడ్ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్, ట్రయేజింగ్, టెస్టింగ్, మందులు, అంబులెన్స్ యాజమాన్యం తదితర విభాగాలు చురుకుగా పనిచేయాలని తెలిపారు. అంబులెన్స్ ల వివరాలు మండలాల వారీగా ఉండాలని ఆయన ఆదేశించారు. 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేస్తుందని... ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చన్నారు కలెక్టర్. ప్రజలు అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల పడకల్లో 50 శాతం ఆరోగ్య శ్రీ క్రింద కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. సీసి కెమెరాల పనితీరు ఇతర అంశాలను యాప్ లో ఆసుపత్రి నోడల్ అధికారులు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో 423 ఐసియు పడకలు, 2004 ఆక్సిజన్ పడకలు., 1,426 కాన్సంట్రేటర్లు, 2,538 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని వివరించారు. 15 పి.ఎస్.ఏ ప్లాంట్లు, 61 కిలో లీటర్ల సామర్థ్యం గల 6 ఎల్.ఎం.ఒ ప్లాంట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లాఠతర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: