ముక్కోటి వైభోగం... తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు...!

Podili Ravindranath
ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రముఖ ఆలయాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఆలయాల్లో నిర్వహకులకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వార దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు కూడా.  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం నిన్న ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. సరిగ్గా అర్థరాత్రి 12 గంటల 5 నిమిషాలకు శ్రీ వారి ఉత్తర ద్వారాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెరిచారు.
ఆగమ శాస్త్రానుసారం స్వామి వారి ఏకాంత సేవలు పూర్తి చేశారు వైఖానన ఆగమ పండితులు. అనంతరం తెల్లవారు జామున ఒంటి గంట 45 నిమిషాల నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో ఆనంద నిలయంలోని వైకుంఠ ద్వారం ఏడాదికి ఒకసారి మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి ప్రముఖులు తిరుమల తరలివచ్చారు. బుధవారమే తిరుమల చేరుకున్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ.... కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ దంపతులతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, జయరామ్, వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్ దంపతులు కూడా శ్రీవారికి మొక్కులు చెల్లించారు. ఇక భారత్ బయోటెక్ సంస్థ తరఫున సీఎండీ కృష్ణా ఎల్లా దంపతులు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఉదయం పది గంటల నుంచి సాధారణ భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు టీటీడీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: