సుదీర్ఘ విరామం తర్వాత జగన్ క్యాబినేట్ భేటీ...!

Podili Ravindranath
దాదాపు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 21వ తేదీన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. గతంలో ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశం నిర్వహించేవారు. అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాల అనంతరం మళ్లీ రెండు నెలల తర్వాత ఇప్పుడే తొలిసారి కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల్లో సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కూడా ఆర్థిక శాఖ అధికారులతో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఓ వారం రోజుల క్రితం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విశేషాలను సహచర మంత్రులకు వివరించనున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పలు అంశాలపై కూడా మంత్రివర్గం దృష్టి సారించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 23 శాతం పీఆర్‌సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే నిరనసలు చేపట్టారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా తమ ప్రొబేషన్ అంశంపై ఆందోళన చేస్తున్నారు. జూన్ నాటికి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కూడా వారి వెనక్కి తగ్గటం లేదు. ఈ అంశంపై కూడా చర్చించి ఓ క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జగన్ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో వెనక్కి తీసుకున్న మూడు రాజధానుల బిల్లు స్థానంలో కొత్త బిల్లు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశంల ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా టికెట్ల ధరల విషయంపై ఇప్పటికే ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై ఇప్పటికే నిపుణుల కమిటీ సూచనలను కూడా సేకరించింది ప్రభుత్వం. వీటిపై కూడా చర్చ జరిగేలా ఉంది. కొవిడ్ థర్డ్ వేవ్ అంటూ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లపై కూడా జగన్ మంత్రివర్గం దృష్టి సారిస్తోంది. ఆంక్షలు సరిపోతాయా,.... లేక లాక్ డౌన్ విధించాలా అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: