తెలంగాణ : కేసీఆర్‌ను ఢీ కొట్టేదెవ‌రు..?

Paloji Vinay
తెలంగాణలో ఊహించ‌ని రీతిలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతువ‌స్తున్నాయి. స్వ‌రాష్ట్రం ఏర్పడిన త‌రువాత వ‌రుస‌గా రెండు సార్లు అధికారం చేప‌ట్టిన కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి నియామ‌కంతో బీజేపీ మ‌రింత దూకుడుగా వెళ్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి పున‌రుత్తేజం తెవ‌డంలో భాగంగా పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియ‌మించింది అధిష్టానం. అయితే, రేవంత్ నియామ‌కంపై పార్టీలోనే వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతూ వ‌స్తోంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌లుచ‌న‌వుతూనే ఉంది.

 ఇదే క్ర‌మంలో దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.. రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు కేంద్రపెద్ద‌లు బండి సంజ‌య్‌కు ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్నారు. బండి సంజ‌య్ అరెస్టుతో కేంద్ర పెద్ద‌లు దిగిరావ‌డం.. దీంతో టీఆర్ఎస్‌-బీజేపీ కలిసి నాట‌కాలు అడుతున్నాయ‌ని రేవంత్ డిఫెన్స్ గేమ్ మొద‌లుపెట్టారు. కానీ, పార్టీని బ‌లంగా త‌యారు చేసేందుకు ఫోక‌స్ పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ పార్టీ కోసం రేవంత్ నిర్ణ‌యాలు తీసుకున్నా.. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు మోకాళ్లు అడ్డువేస్తున్నారు. మ‌ద్ధ‌తు ప‌క్క‌న బెట్టి వ్య‌తిరేకించే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటూ వ‌స్తోంది. అయితే, అధికార పార్టీ కాంగ్రెస్‌ను అడ్డుకుంటోంది ఈ క్ర‌మంలో రేవంత్‌కు అండ‌గా నిల‌వాల్సిన పార్టీ సీనియర్ నాయ‌కులు సైలెంట్‌గా ఉండ‌డంతో రేవంత్ ప్రయ‌త్నాలు విఫ‌లమ‌వ‌తున్నాయి.

 మ‌రోవైపు కాంగ్రెస్‌లోని అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను త‌మ‌కు ప్ల‌స్‌గా మార్చుకుంటున్న బీజేపీ.. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటోంది. దీంట్లో భాగంగానే దూకుడుగా ముందుకు వెళ్తోంది. దీనికి కేంద్రం పెద్ద‌లు కూడా స‌హ‌క‌రించడంతో రాష్ట్రంలో బీజేపీపై స‌హ‌జంగానే ఫోక‌స్ పెరిగింది. మ‌రోవైపు రేవంత్ దూకుడు స్వ‌భావం ఉన్న నేత అయినా.. పార్టీలో స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో వెన‌క‌ప‌డ్డాడ‌ని చెప్పొచ్చు. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టు సాగుతున్న పోరులో కాంగ్రెస్ ప‌క్క‌న ప‌డిపోయింది. మ‌రి రానున్న రోజుల్లో కేసీఆర్‌కు ఈ ఇద్ద‌రి నాయ‌కుల్లో ఎవ‌రు గ‌ట్టి పోటి ఇస్తారు అనే విష‌యంపై ఇప్ప‌టికే రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: