రేపటి నుంచే ఆ వయసు పిల్లలకు వ్యాక్సిన్..!

NAGARJUNA NAKKA
మన దేశంలో 15 నుండి 18ఏళ్ల మధ్య వయసు వారికి జనవరి 3వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా మాత్రమే ప్రస్తుతం ఈ వయసు వారు తీసుకోవడానికి అవకాశం ఉంది. వ్యాక్సిన్ పొందడానికి నిన్న నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కొవిన్ యాప్ లేదా వెబ్ సైట్ లో ఫోన్ నెంబర్ ఇస్తే..ఆ తర్వాత వచ్చిన ఓటీపీని వెరిఫై చేయాలి. ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఏపీలో జనవరి 3వ తేదీ నుంచి 15ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ లేదా వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ పంపిణీ జరుగుతుండగా.. రాష్ట్రంలో 24లక్షల మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. వీరు తొలి డోసు పొందిన 28రోజులకు రెండో డోసు ఇవ్వనుండగా.. కొవిన్ యాప్ లేదా పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. లేదంటే సచివాలయాలకు వెళ్లి వ్యాక్సిన్లు పొందవచ్చు.
మరోవైపు ఏపీలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అనగా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఉద్యోగులు జనవరి 10నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60ఏళ్లు దాటిన వారూ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు కాగా.. ఇందుకోసం రెండు డోసులు పొంది 9నెలలు పూర్తి కావాలి. ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ పొందారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇస్తారు. ఇందుకోసం కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇక కరోనా కష్టకాలంలో ఆఫ్ఘానిస్థాన్ కు భారత్ అండగా నిలిచింది. కరోనాపై పోరులో ఆప్ఘాన్ కు 5లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు అందించింది. భారత్ మానవతా హృదయంతో ఆఫ్ఘాన్ కు వ్యాక్సిన్ పంపిణీ చేసిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబూల్ లోని ఇందిరా గాంధీ ఆస్పత్రికి ఈ వ్యాక్సిన్ డోసులు తరలించినట్టు వెల్లడించింది. త్వరలోనే మరో 5లక్షల డోసులు అందించనున్నట్టు చెప్పింది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: