మత్తు -చిత్తు యువత గమ్మత్తు.. మార్పు రాదా..!

MOHAN BABU
ఒకవైపు వాహనం మీద  ప్రయాణం చేస్తూనే సెల్ ఫోన్ మాట్లాడడం పరధ్యానంలో  పయనించడం అతి వేగంగా దురుసుగా ప్రవర్తించి ఇతరులకు ఆటంకాలు కల్పించడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతున్నది ముఖ్యంగా యువత. మద్యపానానికి పెద్ద మొత్తంలో అలవాటైన యువకులు మద్యం షాపులు బార్లు పబ్లలో అలాగే  కళ్ళు దుకాణాలలో  ఎక్కడ చూసినా వాళ్లే కనపడుతూ తమ సామాజిక ధర్మాన్ని బాధ్యతను కర్తవ్యాన్ని విధినిర్వహణను మరిచిపోతున్నారు. అతివేగంతో ప్రయాణించిన కారణంగా పరస్పరం వాహనాల తాకిడిలో అనునిత్యం దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో యువత కన్ను మూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి కుటుంబాలను రోడ్డున పడేస్తున్న దుర్మార్గపు విధానాన్ని యువత ఇకనైనా కళ్ళు తెరచి మార్చుకోవలసిన అవసరం ఉన్నది.  అతిగా సెల్ఫోన్ వాడకం..!
ఉద్యోగులు ,వ్యాపారులు ,విద్యార్థులు, తిరుగుబోతులు, సర్వమానవాళి చేతిలోనూ ఇవాళ సెల్ ఫోన్ అనేది నిత్యకృత్యం అయిపోయింది. అతిగా వాడడం వల్ల అనారోగ్యం పాలుకావడం ఒక బలహీనత అయితే ముఖ్యంగా విద్యార్థులు సెల్ఫోన్ మీద పడి తమ కర్తవ్యాన్ని పాఠ్యాంశాలు, అధ్యయనాన్ని, బోధనాభ్యసన ప్రక్రియ లో వెనుకంజ వేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా గంటల తరబడి గా ప్రత్యేక దృష్టితో చూస్తూ అందులో ఉన్నటువంటి అశ్లీల చిత్రాలు, బూతు బొమ్మలు, అసభ్య పదజాలం, అసాంఘిక మైనటువంటి సన్నివేశాలు ప్రదర్శనల మాయలోపడి తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతటి ప్రతిభావంతులైన సెల్ఫోన్ దుష్ప్రభావం లో కొట్టుకొని పోక తప్పడంలేదు. ఈ విషయంలో కూడా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు మందలించి సక్రమ మార్గంలో పెట్టే పరిస్థితులు చేయి దాటి పోయినవి .ఇది అత్యంత బాధాకరం. తల్లిదండ్రులు మందలించారని, టీవీ చూడవద్దని హెచ్చరించినా రని, చెడు  స్నేహాన్ని వద్దన్నందుకు, చెప్పకుండా ఇల్లు విడిచి ఇష్టమున్నట్టు తిరిగి నందుకు, హోంవర్క్  రాయనందుకు, మార్కులు తక్కువ వచ్చినందుకు తల్లిదండ్రులు అన్నదమ్ములు స్నేహితులు మందలించారనే నెపంతో ఎంతో మంది విద్యార్థులు యువత అనేక రకాలుగా ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా మనకు అనుభవంలో ఉన్నవే.
 యువతను సక్రమ దారిలో పెట్టడం ఎలా..?
    వాస్తవంగా యువతకు సంబంధించి గాడిలో పెట్టి, విద్యావంతులుగా తీర్చిదిద్ది, ఉపాధి అవకాశాలు కల్పించి ,అర్హులకు ఉద్యోగాలు ఇచ్చి, యువజన విధానాన్ని స్పష్టం గా ప్రకటించ వలసిన బాధ్యత అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా రాష్ట్రములో ఉన్నటువంటి లక్షకుపైగా యువతలో ఉద్యోగాలకు అర్హులు 40 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో కూడా ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి వయస్సు దాటిపోతున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నైపుణ్యం లేనటువంటి తక్కువ విద్యార్హతలు ఉన్నటువంటి వారికి స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రుణాన్ని మంజూరు చేసి పని కల్పించి గాడిలో పెడితే యువతలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రమైక జీవన సౌందర్యాన్ని మించిన టువంటిది ఏదీ లేదు అని యువతకు గుర్తింప చేయవలసిన బాధ్యత సాంస్కృతిక శాఖపై ఎక్కువగా ఉన్నది.
   
యువజన శిబిరాలు, సదస్సులు, విజ్ఞాన మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువలతో కూడిన టువంటి పాఠ్యాంశాలు బోధన సర్వత్రా నీతివంతమైన చర్చలు విద్యార్థులు యువతకు అందుబాటులో ఉంచడం కూడా సమాజం యొక్క బాధ్యత. కుటుంబాలలో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పని పాటలను పిల్లలకు కూడా చిన్నప్పటినుండి నేర్పించడం కూడా మౌలికమైన అంశం. తద్వారా పని పట్ల నిబద్ధతను, కర్తవ్యం పట్ల బాధ్యత ను,  తల్లిదండ్రుల పట్ల ప్రేమను ప్రకటించే విధంగా తీర్చిదిద్దవచ్చు. 2016లో తెరాస ప్రభుత్వం యువజన విధానాన్ని రూపొందించడానికి ఆలోచించినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన యువజన విధానం రాష్ట్రంలో లేకపోవడం యువతకు జరుగుతున్న అన్యాయంగా భావించాలి.
  సినిమాలు టీవీ సీరియళ్లలో వికృత ప్రవర్తన, వింత ధోరణులు, అసభ్య కటింగులు, అశ్లీల చిత్రాలు ,సంభాషణలు, ప్రదర్శనలు కూడా యువతను రెచ్చగొడుతూ దుర్మార్గపు అలవాట్లకు వికృత ప్రవర్తనకు కారణం అవుతున్నట్లుగా మేధావులు మానసిక నిపుణులు చెబుతున్నారు.అయినా ప్రభుత్వాలు ఇప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోలేదు. వెంటనే అలాంటి చిత్రాలపై, ప్రసారాలపై నిషేధం విధించి మేధావులతో మానవాళి సంక్షేమం కోసం ఉపయోగపడే ప్రసార సరళిని నిర్ణయించినట్లయితే ఇటు కుటుంబంలోనూ, అటు యువత లోనూ, మొత్తంపైన సమాజంలోనూ ప్రశాంతత మర్యాద గౌరవము పని పట్ల విశ్వాసము  విధేయత అన్ని వయసుల వారికి అలవడతాయి అనడంలో సందేహం లేదు. యువత ముందువరుసలో నడిస్తే, ప్రభుత్వం యువతను సక్రమంగా వినియోగించుకుంటే ,పరిపాలనలో భాగస్వాములను చేసుకుంటే కొత్త యువతరం రేపటి నవతరానికి, భవిష్యత్తుకు విజయపతాక ఎగరేస్తుoద నడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: