రేవంత్‌తో జగ్గారెడ్డి కయ్యం కంటిన్యూ..అసలు ప్లాన్ అదేనా?

M N Amaleswara rao
తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చ కొనసాగుతుంది. సాధారణంగా ఇతర పార్టీల వాళ్ళు ప్రత్యర్ధులుగా ఉంటారు...అదేంటో గానీ కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ వాళ్లే ప్రత్యర్ధులుగా ఉంటారు. ఒక పార్టీలో ఉంటూనే...ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అసలు రేవంత్ రెడ్డి పి‌సి‌సి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రచ్చ మరింత ముదిరింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం నచ్చని వారు..ఇష్టమొచ్చినట్లు బయటకొచ్చి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి...రేవంత్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇతర సీనియర్ నేతలు కాస్త సైలెంట్ అయ్యారు గానీ...జగ్గారెడ్డి మాత్రం ఎప్పుడు ఏదొక రచ్చ నడుపుతూనే ఉన్నారు. ఒకవేళ పార్టీలో మిస్టేక్‌లు ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి...కానీ జగ్గారెడ్డి ప్రతిసారి వీధికెక్కుతున్నారు. ఆ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
మళ్ళీ పి‌సి‌సి కమిటీ ముందు క్షమాపణ కోరి...ఇంకా తాను బయట ఎప్పుడు మాట్లాడనని, ఏమున్న లోపలే చెబుతానని చెప్పారు. అలా చెప్పిన ఆయన తాజాగా..రేవంత్‌పై విరుచుకుపడ్డారు. తాజాగా రేవంత్ రెడ్డి...కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి తనని ఆహ్వానించకపోవడంపై...సోనియా గాంధీకి రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రేవంత్‌ని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని, లేదంటే ఆయన వైఖరి మార్చాలని కోరారు. సరే లేఖ రాయడం తప్పు కాదని, కానీ లేఖని బహిర్గతం చేయడం కరెక్ట్ కాదని సీనియర్ నేత చిన్నారెడ్డి అంటున్నారు.
జగ్గారెడ్డి క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకాక తప్పదని మాట్లాడారు. అంతకంటే ముందు రేవంత్...క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని అప్పుడే తాను వస్తానని అన్నారు. అంటే ఇక్కడ జగ్గారెడ్డి పూర్తిగా కయ్యం పెట్టుకునే ధోరణిలోనే కనిపిస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు కనిపిస్తోందని, పార్టీ నుంచి సస్పెండ్ కావడానికే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరి ఈ కయ్యం వెనుక జగ్గారెడ్డి ప్లాన్ ఏంటో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: