బండి దీక్ష: ప్రభుత్వం దిగివ‌స్తుందా..?

Paloji Vinay
తెలంగాణ‌లో కమ‌ళం పార్టీని విక‌సంప‌జేయ‌డానికి ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు ఇప్పటికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అధికార పార్టీని ఇరుకున పెడుతూనే.. పార్టీ బ‌లోపేతానికి పావులు క‌దుపుతోంది తెలంగాణ బీజేపీ. ఈ క్ర‌మంలో అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాషాయ ద‌ళ‌ప‌తి బండి సంజ‌య్ నిరుద్యోగ దీక్ష‌కు పూనుకున్నారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాల‌యంలో నేడు దీక్ష‌ను ప్రారంభించారు.

 నీళ్లు, నిధులు, నియ‌మ‌కాలు సాధించుకోవ‌డానికి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ‌లో ఉద్యోగాలు రావ‌డం లేద‌ని దీనికి కార‌ణం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంటూ.. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ద‌గాకు గుర‌య్యార‌ని, వ‌య‌స్సు పెరుగుతున్నా ఉద్యోగం సాధించ‌క‌పోవడంతో క‌ల‌త చెందిన నిరుద్యోగ యువ‌కులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం సీఎం కేసీఆర్ విధానాలేన‌ని ఆరోపించారు. ల‌క్ష‌కు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని అయినా ఇప్పటి వ‌ర‌కు ఎందుకు భ‌ర్తీ చేయడం లేద‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగ నోటిఫికేష‌న్‌ల విష‌యం పై స్ప‌ష్టత ఇచ్చేవ‌ర‌కు బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చెప‌డుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

  అయితే, బండి సంజ‌య్ చేప‌ట్టిన దీక్ష‌కు ప్ర‌భుత్వం దిగివ‌స్తుంద‌ని అంచ‌నా వేయ‌డం క‌ష్టమేన‌ని తెలుస్తోంది. మ‌రోపక్క బండి సంజ‌య్ దీక్ష కేవ‌లం నాట‌కమేన‌ని టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.  బండి  సంజ‌య్ ప‌చ్చి అవ‌కాశ‌వాదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నిజానికి బండి సంజ‌య్ నిరుద్యోగ దీక్ష వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యం నుంచి మ‌రల్చ‌డానికేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు చేస్తున్న క్ర‌మంలో బండి వ్యూహాత్మ‌కంగా  దీక్ష పేరుతో ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను త‌మ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచాల‌ని చూస్తున్న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: