బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

Deekshitha Reddy
2019 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేశారు, లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. అప్పటికి బాలయ్య కేవలం ఎమ్మెల్యేనే, లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అందులోనూ అమరావతి ప్రాంతంలో టీడీపీకి విపరీతమైన మెజార్టీ వస్తుందని భావించారు. కానీ హిందూపురంలో బాలకృష్ణ గెలిచారు, మంగళగిరిలో లోకేష్ ఓడారు. 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్న.
లోకేష్ కష్టపడాల్సిందే..
మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్న లోకేష్, ఇప్పటినుంచే పర్యటనలు పెట్టుకున్నారు. చెమటోడుస్తున్నారు. ఊరూవాడా అంతా కలియదిరుగుతున్నారు, కేడర్ ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయినా కూడా 2024 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ మళ్లీ సీటిస్తుందా, లేక చేనేత సామాజిక వర్గం నుంచి కీలక నేతలెవరినైనా బరిలో దింపుతుందా అనేది వేచి చూడాలి. మొత్తమ్మీద మంగళగిరిలో లోకేష్ గెలుపు మాత్రం నల్లేరుపై నడక కాదు అనేది తేలిపోయింది. రెండేళ్లకు ముందే లోకేష్ మంగళగిరిపై ఫోకస్ పెట్టినా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నాయి టీడీపీ శ్రేణులు.
బాలయ్యకు అదృష్టం..
అటు హిందూపురంలో బాలకృష్ణకు మాత్రం మరోసారి అదృష్టం కలిసొస్తుందని అంటున్నారు. హిందూపురంలో వైసీపీ బలపడకపోగా.. రోజు రోజుకీ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువవుతోంది. నియోజకవర్గ ఇన్ చార్జ్ ఇక్బాల్ కి, కీలక నేత నవీన్ నిశ్చల్ కి మధ్య పొసగడంలేదు. దీంతో 2024నాటికి అక్కడ వైసీపీ పుంజుకునేలా కనిపించడంలేదు. వీరిద్దరి మధ్య పోరాటం చివరకు బాలకృష్ణకు కలసి వచ్చేలా ఉంది. దీంతో బాలయ్య మరోసారి అక్కడ ఈజీగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. అటు మంగళగిరిలో అల్లుడు విజయం కోసం కష్టపడుతుంటే, ఇటు హిందూపురంలో మామ మరోసారి విజయం సాధిస్తానంటూ ధీమాగా ఉన్నారు. అదృష్టం అంటే బాలయ్యదే అంటున్నారు స్థానిక నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: