హ్యాపీ సండే 12-DEC: వీకెండ్ లో బాలు..మ‌ళ్లీ వినండి

RATNA KISHORE

వింటూ వింటూ ఉంటే ఒక పాట

వింటూ వింటూ స్వ‌ర సంచారంలో ఓ పాట

మ‌నిషి కి మ‌నిషికి దూరంలో పాట

ద‌గ్గ‌ర బంధం ఏదీ లేదు అన్న‌ది ఓ పాట

మ‌న్ను తింటే పాట మ‌న్నులో క‌లిసి నివాళిస్తే పాట

అది జలధి తరంగ మృదంగ నాదమా అన్నాడు శ్రీ‌శ్రీ నవ్వేను నేను

ఎవ‌రివో నీవెవ‌రివో అన్న ప‌ల‌వ‌రింపు పాట విష‌య‌మై నాలో లేదు

ఆయ‌న‌కు ఉంది.. ఈ వారాంతం పాట స్మ‌ర‌ణ‌లో మ‌రింత మంచి మ‌న‌స్సుల

స్మ‌ర‌ణ‌లో ఉంటే మేలు.



బాలు వెళ్లిపోయాక కూడా పాట ఉంటుంది..బాలు ఉన్నా కూడా పాట సంబంధిత బాట అలానే ఉంటుంది. మ‌నం అర్థం చేసుకోవ‌డంలోనే సిసలు అర్థం ఉంది. పాతికేళ్లుగా పాడుతా తీయ‌గా అనే కార్య‌క్ర‌మం అలానే ఉంది. మ‌రో పాతికేళ్లు అయినా కూడా అలానే ఉంటుంది. ఉండాలి కూడా! అది ఈ తెలుగువాడి ఆస్తి.. ఇంకా చెప్పాలంటే అది నా మ‌రియు మీ ప్రాథ‌మిక స్వార్థం మ‌రియు హ‌క్కు  కూడా.. స్వార్జిత హ‌క్కు కాదు కాదు స్వ‌రార్చిత హ‌క్కు అని రాయాలి నేను.. ఓవిధంగా ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చే టీఆర్పీలు ఎంత? రేటింగ్ లు ఎంత ? అన్న‌వి కాదు కానీ అంత‌కుమించి ఆలోచించి రాయాలి. బాలు చ‌నిపోయాక, సిరివెన్నెల క‌వి కూడా మ‌న‌ల్ని వీడిపోయాక ఈ నెల ఐదున  వారికి నివాళి ఇస్తూ పాడుతా తీయగా పునః ప్రారంభం అయింది. దుర‌దృష్టం అని రాయ‌డంలో అర్థం లేదు. కాలం కొన్ని ప‌రీక్ష‌లు విధించి వెళ్లాక మ‌నం వాటిని  అనుస‌రించి న‌డ‌క సాగించ‌డం ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం కావాలి. విహిత క‌ర్త‌వ్యం కావాలి. మంచి పాట‌కు మంచి మాట‌కు మ‌రికొన్ని రోజులు ఆయుష్షు ఉంది అని రాసేందుకు మ‌రియు చెప్పేందుకు ఓ గాన వాహిని సాక్షాత్కారం ఇవాళ నా తోడు. తెలుగు వారి తోడు.. అయ్య తోడు.. అమ్మ తోడు అదే! పాట వింటే కోకిల‌మ్మ పెళ్లి .. కోనంత పందిరి గుర్తుకు రావాలి.. ఉచ్ఛ్వాస ఝ‌రి ఒక‌టి ఝమ్మంది నాదంలో క‌లిసి పోవాలి.. అలాంటి క‌విత్వ రీతిని ప‌ట్టి తెచ్చిన పండుగ పండు వెన్నెల సిరి పాడుతా తీయ‌గా.. ఈ వీకెండ్ మ‌రో సారి వినండి.. ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వ‌చ్చే ఉంటుంది..అయినా స‌రే మ‌రో సారి వినండి.. సాహిత్యం విన‌డంలో ఉన్న  అర్థం చ‌ద‌వ‌డంలో ఉన్న అర్థం విని చ‌దివి స్వ‌ర సంధాన‌త‌కు సారథ్య‌త‌కు సార‌ళ్య‌త‌కు ఆపాదించే ల‌క్ష‌ణం అన్నీ అన్నీ స‌మున్నత రీతిలో నేర్చుకోవ‌డం, పాటించ‌డం రేప‌టి క‌వికి ఇప్ప‌టి గాయ‌కుడికి వెరసి క‌వి గాయ‌క వైతాళిక మూర్తికి అవ‌స‌రం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: