ఓటీఎస్‌పై సీఎం క్లారిటీ... ఎవరిష్టం వాళ్లదే...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర వివాదం అవుతున్న అంశం వన్ టైమ్ సెటిల్‌మెంట్.. ఓటీఎస్. సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య పెను దుమారం రేపుతోంది. 1983 నుంచి 2011 ఆగస్టు 15వ తేదీ మధ్య కాలంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకున్న వారు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశం కల్పించింది. ఆస్తిపై పూర్తి హక్కులు వస్తాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది కూడా. అయితే దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పలు కీలక ఆదేశాలను కూడా సీఎం జారీ చేశారు. ఓటీఎస్ అనేది పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి తేల్చేశారు. ఓటీఎస్ కింద క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని కూడా వెల్లడించారు. అలాగే అసలు ఓటీఎస్ విధానంపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని సీఎం సూచించారు.
ఓటీఎస్‌పై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఓటీఎస్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి వివరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం వినియోగించుకున్నా వారికి ఎన్నో లాభాలున్నాయన్నారు ముఖ్యమంత్రి. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 22-ఏ తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌తో పాటు లోన్ క్లియరెన్స్, ఫీల్డ్ స్కెచ్ సర్టిఫీకెట్‌లను ఓటీఎస్ వినియోగించుకున్న వారికి ఇస్తున్నట్లు కూడా తెలిపారు. పథకం అమలుపై అపోహలు ప్రచారం చేస్తున్నారని.... ముఖ్యమంత్రి ఆరోపించారు. దీనికి ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలు సృష్టించేందుకు కూడా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు సీఎం జగన్. ఎలాంటి సమస్యలు లేకుండా ఓటీఎస్ పనులు జరగాలన్నారు. ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని కూడా ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: