టీ బీజేపీ నేతలకు షా పిలుపు... ప్లాన్ బీ రెడీ...!

Podili Ravindranath
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు కూడా. పేరుకు ముగ్గురు శాసన సభ్యులే ఉన్నప్పటికీ... ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ... ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కూడా. ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే గెలిచినంత పని చేసింది బీజేపీ. కొద్దిలో మేయర్ పీఠం చేజారినప్పటికీ... ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు కాషాయ పార్టీ నేతలు. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని విజయం సాధించారు బీజేపీ నేతలు. ఇక ధాన్యం కొనుగోలు అంశంపై అయితే... ఇప్పటికే అధికార పార్టీతో యుద్ధం చేస్తోంది బీజేపీ. దీంతో... అటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. ధాన్యం విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలంటూ పార్లమెంట్ సమావేశాలను కూడా బహిష్కరించారు గులాబీ పార్టీ ఎంపీలు. కేంద్రంపై పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కూడా.
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు కంకణం కట్టుకున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ కాషాయ నేతలతో కీలక సమావేశం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ బండి సంజయ్‌కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా రేపు ఉదయం హస్తినలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమాటివేశం కానున్నారు. రాష్ట్రంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు.. రాష్ట్ర రాజకీయాలు, ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ రాసిన లేఖలపై కూడా అమిత్ షా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా కేంద్ర పెద్దలు రెడీ అయ్యారు. పార్టీలో ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత పెంచేందుకు అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: