జగన్ పై నమ్మకానికి ఇది నిజ‌మైన ప‌రీక్ష‌...!

VUYYURU SUBHASH
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో ఉన్న నమ్మకానికి ఓటీఎస్ పథకం పెద్ద పరీక్షగా మారింది. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం క్రింద 54 లక్షల పేదలకు తాముంటున్న ఇళ్ళపై సర్వహక్కులు కల్పించేందుకే వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానాన్ని తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి లబ్దిదారులందరు ఈనెల 20వ తేదీలోగా కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే ప్రభుత్వం ఇళ్ళను రిజిస్ట్రేషన్లు చేసేస్తుంది కాబట్టి తాముంటున్న ఇళ్ళపై సర్వహక్కులు అందుకోవచ్చని చెప్పింది. ఇదే సమయంలో ఓటీఎస్ విధానంలో ఎవరు డబ్బులు కట్టవద్దని చంద్రబాబునాయుడు అండ్ కో పదే పదే ప్రతిరోజు జనాలకు చెబుతున్నారు. ఓటీఎస్ అనేది పెద్ద మోసమని, పేదలకు ఉరివేయటమే అనేది చంద్రబాబు అండ్ కో చేసే వాదన
అంటే ఓటీఎస్ పథకాన్ని సక్సెస్ చేయించేందుకు ఒకవైపు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఈ పథకాన్ని ఎలాగైనా ఫెయిల్ చేయించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మధ్యలో లబ్దిదారుల్లో అయోమయం పెరిగిపోతోంది. నిజానికి ఈ పథకం ఉద్దేశ్యం మంచిదే అయినా దాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళటంలో ప్రభుత్వం ఫెయిలైందనే చెప్పాలి. పథకం ఉద్దేశ్యం ఏమిటంటే 1983-2011 వరకు ప్రభుత్వాలు పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయటమే కాకుండా గృహనిర్మాణ శాఖ ద్వారా అప్పులు కూడా ఇప్పించాయి. దీంతో లబ్దిదారులందరు ఇళ్ళు కట్టుకున్నారు. తమకిచ్చిన ఇళ్ళ పట్టాల్లో తామే ఇళ్ళు కట్టుకున్నా లబ్దిదారుల్లో ఎవరికీ వాటిపై యాజమాన్య హక్కులు లేవు.
ఏదో అవసరమై తమ ఇళ్ళను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఏ బ్యాంకు కూడా అప్పు ఇవ్వటంలేదు. ఎందుకంటే సదరు ఇల్లు లబ్దిదారుడి సొంతం కాదు. లబ్దిదారుడి పేరుపై ఎక్కడా రిజిస్ట్రేషన్ జరగలేదు. కాకపోతే ఆ ఇంటిలో ఎన్ని సంవత్సరాలైనా లబ్దిదారులు ఉండచ్చే కానీ అమ్ముకునేందుకు లేదు. జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తానని చెబుతోంది. అందుకుగాను నిర్ణీత డబ్బులు కట్టమని చెబుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు అండ్ కో మాత్రం లబ్దిదారులను ప్రభుత్వం మోసం చేస్తోందని గోల చేస్తున్నారు. ఇందులో లబ్దిదారులను ప్రభుత్వం మోసం చేయటమనేది ఎక్కడా లేదు. దశాబ్దాలుగా ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే అనుభవిస్తున్న ఇంటికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పటం మోసం ఎలాగవుతుంది ?
సరే రాజకీయ గోలను పక్కన పెట్టేస్తే రాష్ట్రవ్యాప్తంగా 51.83 లక్షల మంది లబ్దిదారులున్నారు. వీరిలో సోమవారం నాటికి 1.58 లక్షల మంది లబ్దిదారులు డబ్బులు కట్టి యాజమాన్య హక్కులు పొందేందుకు ఓటీఎస్ లో నమోదు చేసుకున్నారు. సోమవారమే మొదలైన పథకంలో 200 మందికి ప్రభుత్వం వారిపేర్లతోనే ఇళ్ళను రిజిస్టర్ చేసేసింది. ఓటీఎస్ లో పేర్లు నమోదు చేసుకునేందుకు లబ్దిదారులకు ఈనెల 20 వరకు సమయం ఇచ్చింది. లబ్దిదారుల్లో అత్యధికంగా 5 .08 లక్షల మంది అనంతపురంలో ఉంటే అతి తక్కువగా 2.91 లక్షల మంది లబ్దిదారులు పశ్చిమ గోదావరిలో ఉన్నారు. ఓటీఎస్ విధానంలో అత్యధికంగా సుమారు 21 వేలమంది ప్రకాశం జిల్లాలో డబ్బులు కట్టి పేర్లను నమోదుచేసుకున్నారు. అతి తక్కువగా 1197 మంది డబ్బులు కట్టి కడప జిల్లాలో పేర్లు నమోదు చేసుకున్నారు.  
మొత్తం 51 లక్షలమంది  లబ్దిదారుల్లో ఎంతమంది ఓటీఎస్ పథకంలో డబ్బులు కట్టి పేర్లు నమోదు చేసుకుంటారనేది చూడాలి. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఎక్కువమంది డబ్బులు కట్టి పేర్లు నమోదు చేసుకుంటారు. అక్కడక్కడ ప్రభుత్వం లబ్దిదారులపై ఒత్తిడి చేస్తోందనే ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ అధికారపార్టీ వాదన ఏమిటంటే చంద్రబాబు అండ్ కో లబ్దిదారులను అయోమయానికి గురిచేసిన కారణంగానే లబ్దిదారుల్లో కొందరు ఇబ్బందులు పడుతున్నారని ఎదురుదాడులు చేస్తున్నారు. ఒకవైపు తమ పక్కవారు డబ్బులు కట్టేసి రిజిస్టర్ చేసుకుని యాజమాన్య హక్కులు పొందుతున్న విషయం చూసిన తర్వాత మిగిలిన వారిలో మార్పు వస్తుందని అధికారపార్టీ నేతలంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: