బాబోయ్ ఏపీలో ఇంత అప్పు ఉందా...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇప్పటికే భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది అంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి కూడా. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే దాదాపు ఊబిలో కూరుకుపోయి ఉంది. ఏ వైపు చూసినా కూడా అ్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. సంక్షేమాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అదే సమయంలో ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. ఇప్పటికే రుణ పరిమితి దాటి పోయిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల కోసం అప్పులు తప్పడం లేదు. ఒకటో తేదీ జీతం రావడం కూడా కష్టమై పోయింది. రుణ పరిమితి పెంచాలంటూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు కూడా రాసింది జగన్ సర్కార్. అదే సమయంలో అప్పు కోసం ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేసింది. జీతభత్యాలు కూడా చెల్లించలేని దారుణమైన స్థితికి ఆర్థిక పరిస్థితి చేరుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి రుణం సేకరిస్తూనే ఉంది. పది జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పటికే 57 వేల 479 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి  సమాధానం ఇచ్చారు. ఏపీలో ఉన్న 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయన్నారు. ఈ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల బాధ్యత కూడా ఆయా కార్పొరేషన్లు, కంపెనీలదే అని స్పష్టం చేశారు. ఈ అప్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2019 సంవత్సరం నుంచి 2021 నవంబర్ వరకు ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి మాత్రమే 11 వేల 937 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ రుణంగా తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: